Jai Shankar: దేశం గురించి ఢిల్లీ ముఖ్యమంత్రి మాట్లాడొద్దు: సింగపూర్ పై వ్యాఖ్యలపై జయశంకర్ స్పందన

  • సింగపూర్ కరోనా వేరియంట్ మన దేశానికి ముప్పు అన్న కేజ్రీవాల్
  • తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన సింగపూర్
  • కేజ్రీ వ్యాఖ్యలు నిరుత్సాహాన్ని కలిగిస్తున్నాయన్న జైశంకర్
Delhi CM should not speak about the country says EAM Jai Shankar

సింగపూర్ లో కొత్త కరోనా వేరియంట్ భారత్ కు తీవ్ర ముప్పుగా మారే అవకాశం ఉందని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆందోళన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ వేరియంట్ చిన్న పిల్లలపై తీవ్ర ప్రభావం చూపుతుందని... అందువల్ల సింగపూర్ నుంచి వచ్చే అన్ని విమానాలను రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు.

ఈ వ్యాఖ్యలపై సింగపూర్ ప్రభుత్వం స్పందిస్తూ... ఈ వేరియంట్ తొలుత భారత్ లోనే బయటపడిందని వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని, పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేసింది.

ఈ క్రమంలో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ మాట్లాడుతూ... దేశంలో ఒక గొప్ప నేతగా పేరుగాంచిన రాజకీయ నాయకుడు వాస్తవాలను తెలుసుకోకుండా చేసిన వ్యాఖ్యలు నిరుత్సాహాన్ని కలిగిస్తున్నాయని అన్నారు. దేశం గురించి మాట్లాడాల్సిన అవసరం ఢిల్లీ ముఖ్యమంత్రికి లేదని వ్యాఖ్యానించారు.

సింగపూర్ తో భారత్ కు బలమైన సంబంధాలు ఉన్నాయని... కరోనాపై పోరాటంలో కూడా ఇరు దేశాలు సమన్వయంతో పనిచేస్తున్నాయని చెప్పారు. ఢిల్లీ ముఖ్యమంత్రి బాధ్యతారాహిత్యంగా చేసిన వ్యాఖ్యలు సింగపూర్ తో సుదీర్ఘకాలంగా ఉన్న బంధాలను బలహీనపరిచేలా ఉన్నాయని అన్నారు. 

More Telugu News