ఈ కరోనా వేరియంట్ ను తొలుత ఇండియాలోనే గుర్తించారు: కేజ్రీవాల్ వ్యాఖ్యలపై సింగపూర్ కౌంటర్

19-05-2021 Wed 08:12
  • సింగపూర్ వేరియంట్ ఇండియాకు ప్రమాదకరమన్న కేజ్రీవాల్
  • మన దేశంలో మూడో వేవ్ కు దారితీసే అవకాశం ఉందని వ్యాఖ్య
  • ఈ వేరియంట్ అనేక దేశాల్లో బయటపడుతోందన్న సింగపూర్
Singapore resonse on Kejriwal comments on Corona new variant

సింగపూర్ కరోనా వైరస్ కొత్త వేరియంట్ మన దేశానికి ప్రమాదకరంగా మారే అవకాశాలు ఉన్నాయంటూ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నిన్న వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఆ వేరియంట్ మన దేశంలో మూడో వేవ్ కు దారితీసే అవకాశం ఉందని... ముఖ్యంగా పిల్లలపై అది తీవ్ర ప్రభావం చూపుతుందని ఆయన అన్నారు. సింగపూర్ నుంచి వచ్చే అన్ని విమానాలను వెంటనే రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.

కేజ్రీవాల్ వ్యాఖ్యలపై సింగపూర్ స్పందించింది. తమ దేశంలో కరోనా కొత్త స్ట్రెయిన్ ఉందనే వార్తల్లో నిజం లేదని తెలిపింది. B.1.617.2 అనే ఈ వేరియంట్ అనేక కరోనా కేసుల్లో బయటపడిందని, సింగపూర్ లో కూడా వెలుగు చూసిందని పేర్కొంది. చిన్న పిల్లల్లో కూడా ఈ వైరస్ ను గుర్తించారని వెల్లడించింది. ఈ వేరియంట్ ను తొలుత ఇండియాలోనే గుర్తించారని... ఇప్పుడు అనేక దేశాల్లో ఈ వేరియంట్ బయటపడుతోందని బదులిచ్చింది.