ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సీఎం కేసీఆర్ కు ధన్యవాదాలు: కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి

18-05-2021 Tue 16:30
  • సంగారెడ్డిలో మెడికల్ కాలేజీ ప్రకటించారన్న జగ్గారెడ్డి
  • మూడేళ్లుగా పోరాటం చేశానని వెల్లడి
  • కుమార్తెతో కలిసి పాదయాత్ర చేశానని వివరణ
  • కాలేజీకి రూ.1000 కోట్లు కేటాయించాలని విజ్ఞప్తి
  • కేసీఆర్ కు భారీ ఎత్తున సన్మానం చేస్తానని స్పష్టీకరణ
  • పార్టీకి సంబంధం లేదని వ్యాఖ్యలు
 Congress MLA Jaggareddy says thanks to CM KCR

సంగారెడ్డి ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి తెలంగాణ సీఎం కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు. సంగారెడ్డిలో వైద్య కళాశాల ఏర్పాటు చేస్తామంటూ ఇచ్చిన మాటను సీఎం కేసీఆర్ నిలబెట్టుకున్నారని జగ్గారెడ్డి వెల్లడించారు. సీఎం కేసీఆర్ అపాయింట్ మెంట్ ఇస్తే వెళ్లి కలుస్తానని, వ్యక్తిగతంగా కృతజ్ఞతలు తెలుపుకుంటానని వివరించారు. ఇది పార్టీకి సంబంధించిన విషయం కాదన్నారు.

జగ్గారెడ్డి సంగారెడ్డిలో మీడియాతో మాట్లాడుతూ, వైద్య కళాశాల కోసం తన పోరాటం ఇప్పటిది కాదన్నారు. మూడేళ్లుగా పోరాడుతున్నానని, తన కుమార్తెతో కలిసి అసెంబ్లీకి పాదయాత్ర కూడా చేశానని వెల్లడించారు. వైద్య కళాశాలకు సీఎం రూ.1000 కోట్లు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. సీఎం కేసీఆర్ స్వయంగా శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనాలని, ఆ రోజున కేసీఆర్ కు భారీ ఎత్తున సన్మానం చేస్తానని చెప్పారు.