సోనూ సూద్ పేరిట నకిలీ ఫౌండేషన్.. విరాళాల సేకరణ.. ప్రజలను అప్రమత్తం చేసిన సోనూసూద్!

18-05-2021 Tue 15:30
  • కరోనా సమయంలో ఆపద్బాంధవుడిగా నిలిచిన సోనూ సూద్
  • సోనూ పేరుతో దోచుకునేందుకు బయల్దేరిన కేటుగాళ్లు
  • అలాంటి వాళ్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలన్న సోను
Some people are collecting donations in the name of Sonu Sood

కరోనా కాలంలో ఒక వ్యక్తి ఒక శక్తిగా మారిన పరిస్థితులను మనం చూశాం. ఆయన మరెవరో కాదు సినీ నటుడు సోనూ సూద్. దేశంలో ఏ ఒక్క ప్రముఖుడు కూడా చేయలేని పనిని ఆయన చేశారు. ఎంతో మందికి ఆపద్బాంధవుడిగా నిలిచారు. సాయం అడిగిన ప్రతి ఒక్కరికీ తన వంతుగా సాయం అందిస్తున్నారు. అయితే, మన దేశంలో కేటుగాళ్లు ఎక్కువ అనే విషయం తెలిసిందే. డబ్బు సంపాదన కోసం అడ్డదారులు తొక్కే వైట్ కాలర్ క్రిమినల్స్ మన దేశంలో ఎక్కువగానే ఉన్నారు. ఇప్పుడు సోను చేస్తున్న ప్రయత్నాలకు కూడా వారు విఘాతం కలిగిస్తున్నారు.

తాజాగా సోనూ సూద్ ఫౌండేషన్ పేరుతో సోషల్ మీడియాలో ఒక ప్రచారం జరుగుతోంది. దేశ ప్రజలకు తాము చేస్తున్న సహాయ, సహకారాలకు అందరూ సహకరించాలని, తోచిన మేరకు విరాళాలు ఇవ్వాలని కేటుగాళ్లు కోరుతున్నారు. దీంతో, ఎంతో మంది సోను మీద అభిమానంతో వారికి తోచిన విరాళాలు పంపుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న సోను... అందరినీ అప్రమత్తం చేశారు. కేటుగాళ్లు షేర్ చేస్తున్న స్క్రీన్ షాట్ ను షేర్ చేస్తూ... ఆ సంస్థకు, తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. ఇలాంటి వాళ్ల విషయంలో అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరారు.