టీమిండియా మహిళా క్రికెటర్ ప్రియా పూనియా తల్లి కరోనాతో మృతి

18-05-2021 Tue 14:42
  • ఇటీవల వేదా కృష్ణమూర్తి తల్లి, సోదరి కరోనాతో మృతి
  • తాజాగా ప్రియా పూనియా కుటుంబంలో విషాదం
  • కరోనాకు చికిత్స పొందుతూ పూనియా తల్లి కన్నుమూత
  • అత్యంత ముఖ్యమైన వ్యక్తిని కోల్పోయాన్న పూనియా
Cricketer Priya Punia lost her mother due to corona

ఇటీవల భారత మహిళా క్రికెటర్ వేదా కృష్ణమూర్తి కుటుంబంలో కరోనా తీవ్ర విషాదం నింపిన ఘటన మరువక ముందే మరో మహిళా క్రికెటర్ కుటుంబాన్ని శోకసంద్రంలో ముంచింది. ఇటీవల వేదా కృష్ణమూర్తి తల్లి, సోదరి కరోనాకు బలైన సంగతి తెలిసిందే. తాజాగా, టీమిండియా మహిళా క్రికెటర్ ప్రియా పూనియా తల్లి కరోనాకు చికిత్స పొందుతూ మరణించారు. ఈ విషయాన్ని ప్రియా పూనియా స్వయంగా వెల్లడించింది.

తన జీవితంలో ముఖ్యమైన వ్యక్తిని కోల్పోయానని ప్రియా తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. తన తల్లే తన మార్గదర్శి అని, జీవితంలో కొన్ని నిజాలను అంగీకరించకతప్పదని పేర్కొంది. అమ్మ జ్ఞాపకాలు ఎప్పుడూ పదిలంగానే ఉంటాయని తెలిపింది. కరోనా వైరస్ చాలా ప్రమాదకరమైందని, ప్రతి ఒక్కరూ మాస్కు ధరించి, భౌతికదూరం పాటిస్తూ, సురక్షితంగా ఉండాలని ప్రియా పూనియా సూచించింది.