ముందస్తు బెయిల్ కోసం ఢిల్లీ కోర్టును ఆశ్రయించిన రెజ్లర్ సుశీల్ కుమార్

18-05-2021 Tue 14:10
  • ఇటీవల ఢిల్లీలో సాగర్ ధంకడ్ అనే రెజ్లర్ హత్య
  • హత్యలో సుశీల్ కుమార్ హస్తం
  • హత్య తర్వాత సుశీల్ కుమార్ పరారీ
  • లుకౌట్ నోటీసులు జారీ చేసిన పోలీసులు
  • తాజాగా లక్ష రూపాయల రివార్డు
Wrestler Sushil Kumar files bail petition in a Delhi court

హత్య కేసులో నిందితుడిగా భావిస్తున్న భారత స్టార్ రెజ్లర్ సుశీల్ కుమార్ ప్రస్తుతం పరారీలో ఉండగా, అతడి తలపై పోలీసులు లక్ష రూపాయల రివార్డు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సుశీల్ కుమార్ ఢిల్లీలోని రోహిణి కోర్టును ఆశ్రయించాడు. ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు.

 ఇటీవల ఢిల్లీలోని ఛత్రసాల్ స్టేడియంలో సాగర్ ధంకడ్ అనే జూనియర్ రెజ్లర్ హత్య జరిగింది. ఈ హత్యలో సుశీల్ కుమార్ కూడా పాల్గొన్నాడని పోలీసులు గుర్తించారు. ధంకడ్ హత్య తర్వాత సుశీల్ కుమార్ పరారీలో ఉండడంతో అతడి పాత్రపై అనుమానాలు బలపడ్డాయి.

గత వారం రోజులుగా సుశీల్ కుమార్ కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నప్పటికీ అతడి ఆచూకీ దొరకలేదు. అతడిపై నాన్ బెయిలబుల్ వారెంట్ కూడా జారీ అయింది. మూడ్రోజుల కిందటే లుకౌట్ నోటీసులు కూడా జారీ అయ్యాయి. కాగా, సుశీల్ కుమార్ బెయిల్ పిటిషన్ పై ఈ మధ్యాహ్నం విచారణ జరిగే అవకాశం ఉంది.