Jagan: మృతి చెందిన జర్నలిస్టుల కుటుంబాలకు తక్షణమే ఆర్థికసాయం అందించాలి: జగన్ కు ఏపీ జర్నలిస్ట్ యూనియన్ లేఖ

  • మీరు ఇచ్చిన హామీ పూర్తి స్థాయిలో అమలు కావడం లేదు
  • కరోనా బాధిత జర్నలిస్టులకు ఆసుపత్రుల్లో బెడ్లు కూడా దొరకడం లేదు
  • జర్నలిస్టులను ఫ్రంట్ లైన్ వారియర్స్ గా గుర్తించాలి
AP Journalist union writes letter to CM Jagan

కరోనా మొదటి వేవ్ సమయంలోనే కరోనాతో చనిపోయిన జర్నలిస్టుల కుటుంబాలకు రూ. 5 లక్షల ఆర్థిక సాయం చేస్తామని మీరు హామీ ఇచ్చారని... అయితే, అది పూర్తి స్థాయిలో అమలు కావడం లేదని ఏపీ సీఎం జగన్ కు ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ (ఏపీయూడబ్లూజే) రాష్ట్ర అధ్యక్షుడు ఐవీ సుబ్బారావు లేఖ రాశారు.

కరోనా సెకండ్ వేవ్ సమయంలో మరో 70 మందికి పైగా జర్నలిస్టులు కరోనాతో మృతి చెందారని లేఖలో పేర్కొన్నారు. జర్నలిస్టుల సమస్యలు, ఇబ్బందులను తొలగించాల్సిన సమాచారశాఖ మంత్రి పేర్ని నాని ఎక్కడున్నారో కూడా ఎవరికీ తెలియని పరిస్థితి ఉందని అన్నారు.

జర్నలిస్టులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైన సమాచారశాఖ మంత్రి పేర్ని నాని తక్షణమే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కరోనాకు చికిత్స చేయించుకునేందుకు ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో బెడ్లు కూడా దొరకని దురదృష్టకర పరిస్థితుల్లో రాష్ట్రంలోని జర్నలిస్టులు ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

జర్నలిస్టులందరినీ కరోనా ఫ్రంట్ లైన్ వారియర్స్ గా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలని ఐవీ సుబ్బారావు డిమాండ్ చేశారు. మృతి చెందిన జర్నలిస్టుల కుటుంబాలకు తక్షణమే ఆర్థికసాయం అందించాలని కోరారు. జర్నలిస్టులందరికీ ప్రభుత్వం వ్యాక్సినేషన్ చేయించాలని అన్నారు. జర్నలిస్టులకు సాయాన్ని అందించకపోగా... భావ ప్రకటనా స్వేచ్ఛను హరించే విధంగా మీడియా సంస్థలపై కేసులు పెడుతున్నారని విమర్శించారు.

More Telugu News