సుశీల్​ ను పట్టిస్తే రూ.లక్ష ఇస్తాం: రెజ్లర్​ తలపై పోలీసుల రివార్డు

18-05-2021 Tue 12:16
  • యువ రెజ్లర్ హత్య కేసులో తప్పించుకు తిరుగుతున్న వైనం
  • మరో నిందితుడిపై రూ.50 వేలు
  • ఢిల్లీ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్
Delhi Police Announces Bounty On Sushil Kumar

తోటి రెజ్లర్ హత్య కేసులో తప్పించుకు తిరుగుతున్న రెజ్లర్ సుశీల్ కుమార్ తలపై ఢిల్లీ పోలీసులు రివార్డు ప్రకటించారు. అతడిని పట్టించినా, ఆచూకీ చెప్పినా రూ.లక్ష నజరానాను అందజేస్తామని చెప్పారు. మరో నిందితుడు అజయ్ పై రూ. 50 వేల నజరానా ప్రకటించారు.

మే 4న ఢిల్లీ ఛత్రసాల్ స్టేడియంలో జరిగిన గొడవలో.. తోటి రెజ్లర్లపై సుశీల్, అతడి సహచరులు దాడికి దిగారు. ఆ దాడిలో తీవ్రగాయాలపాలైన వారిని ఆసుపత్రికి తీసుకెళ్లగా.. సాగర్ రాణా అనే 23 ఏళ్ల యువ రెజ్లర్ కన్నుమూశాడు. ఆ దాడితో తమకు సంబంధం లేదని మొదట్లో సుశీల్ ప్రకటించినా.. ఆ మర్నాటి నుంచే కనిపించకుండా పోయాడు.

పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. అతడితో పాటు కేసులో నిందితులుగా ఉన్న మరికొందరిపైనా ఢిల్లీ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ ను జారీ చేసింది.