రాజకీయ నేతలు క‌రోనా ఔష‌ధాల‌ను పంపిణీ చేస్తుండడంపై ఢిల్లీ హైకోర్టు ఆగ్ర‌హం

18-05-2021 Tue 11:24
  • అస‌లే మార్కెట్లో క‌రోనా ఔష‌ధాల కొర‌త
  • ఈ స‌మ‌యంలో రాజ‌కీయ నేత‌ల అత్యుత్సాహం
  • ప్రాణాధార ఔష‌ధాల కొనుగోలు, నిల్వ‌
  • మ‌రోవైపు బ్లాక్ మార్కెట్‌లో ఔష‌ధాలు
delhi high cour serious on political leaders procurement of drugs

క‌రోనా వేళ కొంద‌రు రాజ‌కీయ‌ నేత‌లు ప్ర‌ద‌ర్శిస్తోన్న అత్యుత్సాహంపై ఢిల్లీ హైకోర్టు ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. అస‌లే మార్కెట్లో క‌రోనా ఔష‌ధాల కొర‌త ఉంటే ఆయా ఔష‌ధాల‌ను కొనిపెట్టుకుంటోన్న కొందరు నేత‌లు వాటిని రోగుల‌కు పంచుతూ ప్రచారం చేసుకుంటున్నారు.

మాజీ క్రికెటర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్, ఢిల్లీ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడు చౌధరీ అనిల్‌కుమార్, మాజీ ఎమ్మెల్యే ముఖేశ్‌ శర్మ, బీజేపీ నేత హరీశ్‌ ఖురానా, ఆప్‌ ఎమ్మెల్యే దిలీప్‌ పాండే, అఖిల భారత యువజన కాంగ్రెస్‌ అధ్యక్షుడు బీవీ శ్రీనివాస్ వంటి  రాజ‌కీయ నాయ‌కులు పంచుతోన్న ఔష‌ధాల‌పై విచార‌ణ జ‌రుపుతోన్న ఢిల్లీ హైకోర్టు వారికి చివాట్లు పెట్టింది.

కరోనా ఔషధాలకు తీవ్ర కొరత ఉన్న సమయంలో రాజకీయ నాయకులు వాటిని సమకూర్చుకొని, నిల్వ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. వారంతా స‌మ‌కూర్చుకున్న ఔష‌ధాల‌ను వెంట‌నే ఆరోగ్య సేవల డైరెక్టర్‌ జనరల్‌ (డీజీహెచ్‌ఎస్‌)కు అప్పగిస్తారని ఆశిస్తున్నట్లు పేర్కొంది.

అలాగే, అటువంటి రాజ‌కీయ నాయకుల‌పై విచార‌ణ జ‌రిపించాలంటూ తాము ఇచ్చిన ఆదేశాల మేర‌కు ద‌ర్యాప్తు జరుపుతోన్న ఢిల్లీ పోలీసులు సమర్పించిన దర్యాప్తు నివేదిక అస్పష్టంగా ఉంద‌ని జస్టిస్‌ విపిన్‌ సంఘి, జస్టిస్‌ జస్మీత్‌ సింగ్‌లతో కూడిన ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది.

రాజకీయ నేత‌ల ప్రమేయం ఉన్న కేసులో విచార‌ణ జ‌ర‌ప‌బోమంటే ఒప్పుకోబోమ‌ని చెప్పింది. కాగా, ఈ కేసులో రాజ‌కీయ నేత‌ల‌ను ప్రశ్నించామని పోలీసులు తెలిపారు. అయితే, క‌రోనా వేళ‌ ప్రజలకు స్వచ్ఛందంగా సాయం చేసే ఉద్దేశంతోనే ఔష‌ధాలు, వైద్య పరికరాలను వారు సేకరించారని పోలీసులు నివేదిక స‌మ‌ర్పించారు.  

ఈ కేసులో విచార‌ణ పూర్తి చేయ‌డానికి త‌మకు 6 వారాల గడువు ఇవ్వాలని పోలీసులు కోరారు. అయితే, క‌రోనా వ్యాప్తి చెందుతోన్న నేప‌థ్యంలో వెంటనే చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని ధ‌ర్మాసనం చెప్పింది. ఔషధాలు, వైద్య పరికరాలు సేకరించి, పంపిణీ చేయ‌డం స‌రికాద‌ని స్పష్టం చేసింది.

ఇటువంటి చ‌ర్య‌ల‌  వల్ల క‌రోనా బాధితులు బ్లాక్ మార్కెట్‌లో అధిక ధ‌ర‌ల‌కు  ఔష‌ధాలు కొనుగోలు చేయాల్సి వస్తుందని ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. ఔష‌ధాలు దొర‌క్క‌, కొనే స్తొమత లేక‌ కొందరు ప్రాణాలు కోల్పోతున్నారని చెప్పింది. బాధ్యులను గుర్తించాలని, దీనిపై వారంలో నివేదిక సమర్పించాలని పోలీసులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అంతేగాక‌, రాజకీయ నాయకులు ఔషధాలను నిల్వచేయడాన్ని ప్రశ్నిస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంలో ఢిల్లీ డ్రగ్‌ కంట్రోలర్‌ను కూడా ప్రతివాదిగా చేర్చుతూ ధ‌ర్మాస‌నం నోటీసు జారీ చేసింది.