Chandrababu: అది దుర్మార్గం కాదా.. చంద్రబాబు చెబితేనే రఘురామకు టికెట్ ఇచ్చారా?: బుద్ధా వెంకన్న ఫైర్

  • రమేశ్ ఆసుపత్రికి, చంద్రబాబుకు సంబంధం ఏమిటి?
  • అన్ని కేసులు ఉన్న జగన్ మాత్రం రాష్ట్రాన్ని పాలించొచ్చా: మర్రెడ్డి
  • జగన్ ప్రభుత్వంలో ఓ సామాజిక వర్గానికే ప్రాధాన్యం: సుధాకర్
Buddha Venkanna Fires on YCP

వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణరాజు విషయంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడుపై వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలకు ఆ పార్టీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ఘాటుగా బదులిచ్చారు. హత్యా రాజకీయాలు, కక్ష సాధింపులు, వేధింపులు, కులమతాల మధ్య చిచ్చు పెట్టడం చంద్రబాబుకు తెలియదన్నారు.

అరెస్ట్ చేసిన రఘురామకు ప్రాణహాని ఉందని ఆయన కుటుంబ సభ్యులు చెబుతుంటే, వైసీపీ నేతలు మాత్రం చంద్రబాబుపై నిందలు వేస్తుండడం దుర్మార్గమన్నారు. గత ఎన్నికల్లో చంద్రబాబు చెప్పినందుకే రఘురామకు జగన్ టికెట్ ఇచ్చారా? అని వైసీపీని నిలదీశారు. రమేశ్ ఆసుపత్రికి, చంద్రబాబుకు సంబంధం ఏంటని బుద్ధా వెంకన్న ప్రశ్నించారు.

మరోవైపు, తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి కూడా జగన్‌పై ఫైరయ్యారు. కేసులు ఉన్న రమేశ్ ఆసుపత్రి రఘురామ రాజుకు వైద్యం చేయించకూడదని అంటున్నారని, మరి పలు కేసుల్లో ఏ1 నిందితుడిగా ఉన్న జగన్ రాష్ట్రాన్ని పాలించొచ్చా? అని ప్రశ్నించారు.

రఘురామ రాజు ఐదు పార్టీలు మారారని, బ్యాంకులకు డబ్బులు ఎగ్గొట్టారని వైసీపీ నేతలు చెబుతున్నారని, ఆ విషయం ఇప్పుడే తెలిసిందా? అని మండిపడ్డారు. ఎంపీకి ప్రాణహాని ఉందని కేంద్ర హోంశాఖకు చంద్రబాబు లేఖ రాస్తే తప్పేంటని శ్రీనివాసరెడ్డి అన్నారు. జగన్ ప్రభుత్వంలో ఓ సామాజిక వర్గానికే ప్రాధాన్యముందన్న విషయం అందరికీ తెలిసిందేనని టీడీపీ అధికార ప్రతినిధి సుధాకర్ రెడ్డి అన్నారు.

More Telugu News