Tushar Arothe: భారత మహిళల క్రికెట్లో రాజకీయాలు ఎక్కువ: మాజీ కోచ్ ఆరోపణలు

  • చర్చనీయాంశంగా మారిన భారత మహిళల క్రికెట్
  • ఇటీవలే కోచ్ మార్పు
  • మళ్లీ బాధ్యతలు చేపట్టిన రమేశ్ పొవార్
  • మహిళల క్రికెట్ పరిస్థితులు వివరించిన మాజీ కోచ్ అరోథే
Tushar Arothe opines on in Indian women cricket

భారత మహిళల క్రికెట్ కోచ్ గా మాజీ ఆటగాడు డబ్ల్యూవీ రామన్ పదవీకాలం పూర్తి కాగా, ఈసారి రమేశ్ పొవార్ కు కోచ్ అవకాశం దక్కడం తెలిసిందే. రామన్ పోతూపోతూ మహిళల జట్టులో స్టార్ సంస్కృతి ఉందని, అది తొలగిపోతేనే జట్టు బాగుపడుతుందని వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో, గతంలో భారత మహిళల జట్టుకు కోచ్ గా వ్యవహరించిన మాజీ రంజీ ఆటగాడు తుషార్ అరోథే కూడా ఆరోపణలు చేశారు.

భారత క్రికెట్లో రాజకీయాలు ఎక్కువని అన్నారు. పురుషుల క్రికెట్ ఎంతో పారదర్శకంగా ఉంటుందని, మహిళల క్రికెట్ అలా కాదని అన్నారు. జట్టులో వంతపాడే ధోరణులు అధికంగా ఉంటాయని వివరించాడు. ఓ టోర్నమెంటులో జట్టు బాగా ఆడకపోతే కోచ్ ను బలిపశువును చేస్తారని వెల్లడించాడు.

తన హయాంలో భారత జట్టు 2017లో వరల్డ్ కప్ ఫైనల్ చేరిందని, కానీ ఆ తర్వాత విఫలం అయిందని తెలిపాడు. పెద్ద జట్లతో పోటీ పడే విధంగా ఆటతీరు మెరుగుపర్చుకోవాలని మహిళా క్రికెటర్లకు సూచిస్తే, అది వారికి నచ్చలేదని పేర్కొన్నాడు. తర్వాత కాలంలో తన ఉద్వాసనకు అదే కారణమై ఉంటుందని భావిస్తున్నట్టు తెలిపాడు. ఈసారి కోచ్ పదవికి 35 దరఖాస్తులు వస్తే ఎనిమిదింటితో తుదిజాబితా రూపొందించారని వెల్లడించారు. భారత మహిళల జట్టు టీ20 వరల్డ్ కప్ ఫైనల్ చేరడంలో కీలకపాత్ర పోషించిన రామన్ నే మళ్లీ కోచ్ గా చేస్తారని భావిస్తే, ఫలితం మరోలా వచ్చిందని అరోథే పేర్కొన్నారు.

ఇక, ప్రస్తుతం కోచ్ గా ఎంపికైన రమేశ్ పొవార్ గతంలోనూ కోచ్ గా పనిచేశాడని, ఆ సమయంలో అతడికి స్టార్ ప్లేయర్ మిథాలీ రాజ్ తో విభేదాలు ఏర్పడిన సంగతి అందరికీ తెలిసిందేనని వివరించాడు. అది గతం అని, ఇప్పుడు ఆ ఇద్దరి లక్ష్యం వరల్డ్ కప్ గెలవడమేనని, అందుకే విభేదాలు పక్కనబెట్టి కలసికట్టుగా జట్టుకోసం పనిచేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు.

తుషార్ అరోథే వ్యాఖ్యలు అటుంచితే... గత నాలుగేళ్లుగా భారత మహిళల క్రికెట్ జట్టు పురోగామి పథంలో నడుస్తున్నా, అదే సమయంలో కోచ్ లను తరచుగా మార్చడం విమర్శలకు తావిస్తోంది.

  • Loading...

More Telugu News