భారత్ లో ఒక్కరోజులో 50 మంది డాక్టర్లు కరోనాకు బలి

17-05-2021 Mon 21:40
  • భారత్ లో కొనసాగుతున్న సెకండ్ వేవ్
  • 244 మంది డాక్టర్ల కన్నుమూత
  • అత్యధికంగా బీహార్లో 69 మంది మృతి
  • కరోనా ఫస్ట్ వేవ్ లో 736 మంది డాక్టర్ల మరణం
Doctors faces severe life threat from corona

కరోనా సెకండ్ వేవ్ డాక్టర్ల పాలిట కూడా మృత్యుఘంటికలు మోగిస్తోంది. దేశంలో కరోనా సెకండ్ వేవ్ మొదలయ్యాక ఇప్పటివరకు 244 మంది వైద్యులు ప్రాణాలు కోల్పోయారని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) వెల్లడించింది. నిన్న ఒక్కరోజే 50 మంది డాక్టర్లు కరోనాకు బలి కావడం పరిస్థితి తీవ్రతను చాటుతోందని ఐఎంఏ పేర్కొంది.

అత్యధికంగా బీహార్లో 69 మంది, ఉత్తరప్రదేశ్ లో 34 మంది, ఢిల్లీలో 27 మంది డాక్టర్లు కరోనాతో కన్నుమూశారని వివరించింది. దేశంలో చనిపోయిన  మొత్తం డాక్టర్లలో కేవలం 3 శాతం మందే 2  డోసుల  వ్యాక్సిన్ పొందారని పేర్కొంది. అందుకే డాక్టర్లు కరోనా వ్యాక్సిన్ తీసుకునేలా ప్రోత్సహిస్తున్నామని, అందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని ఐఎంఏ వెల్లడించింది. కరోనా ఫస్ట్ వేవ్ లో మొత్తం 736 మంది డాక్టర్లు చనిపోయారని వివరించింది.