గుజరాత్ తీరాన్ని తాకిన తౌతే... 2 గంటల పాటు కొనసాగనున్న విధ్వంసం

17-05-2021 Mon 21:21
  • అరేబియా సముద్రంలో తౌతే తుపాను
  • పెను తుపానుగా తీరాన్ని చేరిన వైనం
  • గుజరాత్ తీరప్రాంతాల్లో విలయం
  • గంటకు 185 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు
  • తీర ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు
Extremely severe cyclone Tauktae makes landfall at Gujarat coast

అరేబియా సముద్రంలో మరింత శక్తిమంతంగా మారిన తౌతే పెను తుపాను గుజరాత్ తీరాన్ని తాకింది. ఈ రాత్రికి గుజరాత్ లోని పోరుబందర్, మహువా ప్రాంతాల మధ్య తీరాన్ని దాటనుందని భారత వాతావరణ సంస్థ (ఐఎండీ) వెల్లడించింది. తౌతే ప్రభావంతో గుజరాత్ తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు, ఈదురుగాలులతో పరిస్థితి బీభత్సకరంగా మారింది. గుజరాత్ తీరంలో తౌతే ప్రభావం 2 గంటల పాటు కొనసాగనుందని ఐఎండీ అంచనా వేసింది. అప్పటికి తుపాను పూర్తిగా భూభాగంపైకి ప్రవేశిస్తుందని భావిస్తున్నారు.

తౌతే పెను తుపాను స్థాయిలో తీరాన్ని తాకడంతో గంటకు 185 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. తీరప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. అధికారులు ఇప్పటికే లక్షల మంది ప్రజలను లోతట్టు ప్రాంతాల నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వారిలో తీర ప్రాంత పట్టణ ఆసుపత్రుల్లోని కొవిడ్ రోగులు కూడా ఉన్నారు.