బాలీవుడ్‌లో నా మిత్రులే నాకు వెన్నుపోటు పొడిచారు: నటుడు శ్రేయస్‌

17-05-2021 Mon 20:37
  • 2005లో ఇక్బాల్‌ చిత్రంతో బాలీవుడ్‌లోకి శ్రేయస్‌ ఎంట్రీ
  • ఓం శాంతి ఓం వంటి హిట్‌ చిత్రాల్లో నటన
  • కొన్నేళ్లుగా విజయాలు లేక ఇబ్బందులు
  • ఒకప్పటి మిత్రులు దూరం పెడుతున్నారని ఆరోపణ
  • స్క్రీన్‌ షేర్‌ చేసుకోవడానికి ఇష్టపడడం లేదన్న శ్రేయస్‌
Shreyas Talpade says his bollywood frnds backstabbed him

బాలీవుడ్‌లో గోల్‌మాల్‌ సిరీస్‌, హౌస్‌ఫుల్‌-2 సహా పలు చిత్రాల్లో నటించిన శ్రేయస్‌ తల్పడే సంచలన ఆరోపణలు చేశారు. ఒకప్పుడు తనతో కలిసి సినిమాలు చేసిన మిత్రులే ఇప్పుడు తనని వద్దనుకుంటున్నారని తెలిపారు. తాను నటించిన కొన్ని చిత్రాలు అనుకున్న స్థాయిలో విజయం సాధించకపోవడమే అందుకు కారణమన్నారు. టైమ్స్‌ ఆఫ్‌ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ ఆరోపణలు చేశారు.

బాలీవుడ్‌లో తాను కొన్ని చిత్రాలు కేవలం మిత్రుల కోసమే చేశానని.. కానీ, వారే ఇప్పుడు తనని సినిమాలకు దూరం పెడుతున్నారని శ్రేయస్‌ వాపోయాడు. తాను సినిమాలో ఉంటే వారు అభద్రతకు గురవుతున్నారని ఆరోపించాడు. తనతో స్క్రీన్‌ పంచుకోవడానికి వెనకాడుతున్నారని తెలిపారు.

 బాలీవుడ్‌లో 90 శాతం పరిచయాలేనని.. కేవలం కొద్ది మంది మాత్రమే మిత్రులుగా ఉంటారని తెలిపారు. గతంలో తనతో కలిసి సినిమాలు చేసిన మిత్రులు ఇప్పుడు తనని కలుపుకొని పోవడానికి ఇబ్బంది పడుతున్నారన్నారు. తాను లేకుండానే సినిమాలు చేస్తున్నారన్నారు. అలాంటి వారు మిత్రులు ఎలా అవుతారని ప్రశ్నించారు. తన మిత్రులే ఇప్పుడు తనకు వెన్నుపోటు పొడిచారన్నారు.

2005లో ఇక్బాల్‌ సినిమాతో బాలీవుడ్‌లోకి ప్రవేశించిన శ్రేయస్‌ ఓం శాంతి ఓం, వెల్‌కం టు సజ్జన్‌పూర్‌, హౌస్‌ఫుల్-2, గోల్‌మాల్‌ సిరీస్‌ వంటి హిట్‌ సినిమాల్లో నటించాడు. 2019లో విడుదలైన సెట్టర్స్‌ ఆయన చివరి చిత్రం.