బ్లాక్ ఫంగస్ ఎక్కువగా ఎవరికి సోకుతుందో చెప్పిన ఏపీ వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి

17-05-2021 Mon 20:14
  • సెకండ్ వేవ్ లో చర్చనీయాంశంగా మారిన బ్లాక్ ఫంగస్
  • కొవిడ్ రోగుల్లో తీవ్ర ఆందోళన
  • ఇది అందరికీ రాదన్న అనిల్ కుమార్ సింఘాల్
  • మధుమేహం అదుపులో లేని వారికి సోకే అవకాశాలు ఉన్నాయని వెల్లడి
  • షుగర్ నియంత్రణలో ఉంచుకుంటే సోకదని స్పష్టీకరణ
Anil Kumar Singhal explains Black Fungus

ఇప్పుడెక్కడ చూసినా బ్లాక్ ఫంగస్ గురించే చర్చ జరుగుతోంది. కరోనా రోగుల్లో కనిపిస్తున్న ఈ ప్రమాదకారి ప్రాణాలను బలిగొంటుండడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. కంటిచూపు పోవడమే కాకుండా, ఊపిరితిత్తులను కూడా తీవ్రస్థాయిలో దెబ్బతీస్తున్న ఈ బ్లాక్ ఫంగస్ పై ఏపీ వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ వివరణ ఇచ్చారు. బ్లాక్ ఫంగస్ పై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఇది అందరికీ రాదని స్పష్టం చేశారు.

మధుమేహ బాధితుల్లోనే ఇది ఎక్కువగా కనిపిస్తుందని, షుగర్ నియంత్రణలో ఉంటే దీని గురించి భయపడనక్కర్లేదని వివరించారు. పరగడుపున షుగర్ లెవల్ 125 లోపు, తిన్న తర్వాత 250 లోపు ఉండేలా చూసుకుంటే బ్లాక్ ఫంగస్ సోకే అవకాశాలు చాలా తక్కువ అని పేర్కొన్నారు. వాతావరణంలో సహజంగా ఉండే మ్యూకోర్ అనే ఫంగస్ గాలి ద్వారా ఊపిరితిత్తుల్లోనూ, సైనస్ లోనూ చేరి ఇన్ఫెక్షన్లు కలుగచేస్తుందని వెల్లడించారు. కొవిడ్ సోకిన వారిలో ఇతర ఆరోగ్య సమస్యలు ఉంటే వారికి ఈ బ్లాక్ ఫంగస్ అధికంగా సోకే అవకాశాలు ఉంటాయని తెలిపారు.

మధుమేహం ఉన్నవారు, మోతాదుకు మించి స్టెరాయిడ్స్ వాడే వారు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు, శస్త్రచికిత్సలు చేయించుకున్న వారిలోనే బ్లాక్ ఫంగస్ వృద్ధి చెందేందుకు అవకాశాలు ఉంటాయని సింఘాల్ వివరించారు. సాధారణ కొవిడ్ రోగులకు బ్లాక్ ఫంగస్ సోకదని స్పష్టం చేశారు.