సీబీఐ అరెస్ట్ చేసిన బెంగాల్‌ మంత్రులకు బెయిల్‌ మంజూరు!

17-05-2021 Mon 20:02
  • నారదా కుంభకోణం కేసులో అరెస్టయిన మంత్రులు
  • మరో ఇద్దరినీ అదుపులోకి తీసుకున్న సీబీఐ
  • అరెస్టును వ్యతిరేకిస్తూ మమత నిరసన
  • రోజులో ఎక్కువ భాగం సీబీఐ ఆఫీసులోనే ఉన్న దీదీ
  • ఎట్టకేలకు సాయంత్రం బెయిల్‌ మంజూరు
Bail was granted to tmc ministers after a day long protest from Mamata

నారదా కుంభకోణం కేసులో సీబీఐ అరెస్టు చేసిన ఇద్దరు పశ్చిమ బెంగాల్‌ మంత్రులతో పాటు మరో ఇద్దరు నాయకులకు కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. అంతకుముందు కోల్ కతాలోని సీబీఐ కార్యాలయం ఎదుట నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. వారి అరెస్టును నిరసిస్తూ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రోజులో ఎక్కువ భాగం సీబీఐ ఆఫీసు వద్దే ఉన్నారు. కావాలంటే తననూ అరెస్టు చేయాలని సీబీఐ అధికారులకు సవాల్‌ విసిరారు.

ఈరోజు ఉదయం నారదా కుంభకోణం కేసులో ఇటీవలే మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన ఫిర్హాద్‌ హకీం, సుబ్రతా ముఖర్జీతో పాటు తృణమూల్‌ ఎమ్మెల్యే మదన్ మిత్రా, మాజీ తృణమూల్‌ నేత సోవణ్‌ ఛటర్జీని సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వీరి అరెస్టును వ్యతిరేకిస్తూ దీదీ సహా తృణమూల్‌ వర్గాలు సీబీఐ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు.