ఐసీయూ బెడ్ దొరక్క టాలీవుడ్ దర్శకుడి తల్లి మృతి

17-05-2021 Mon 18:25
  • దర్శకుడు సుబ్బుకు మాతృవియోగం
  • కరోనాతో బాధపడుతూ తల్లి మంగమ్మ కన్నుమూత
  • ఐసీయూ బెడ్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేసిన సుబ్బు
  • సుబ్బు తల్లిని కాపాడుకోలేకపోయామన్న సాయితేజ్
Tollywood director Subbu lost his mother due to corona

సెకండ్ వేవ్ లో కరోనా మహమ్మారి బారినపడిన వారిలో చాలామంది ఆసుపత్రిపాలవుతున్నారు. వారిలో అత్యధికుల పరిస్థితి కొద్ది వ్యవధిలోనే విషమంగా మారుతోంది. దాంతో ఐసీయూ బెడ్లకు, ఆక్సిజన్ కు, వెంటిలేటర్లకు విపరీతమైన డిమాండ్ ఏర్పడుతోంది. సామాన్యులకే కాదు, సెలబ్రిటీలకు సైతం ఈ పరిస్థితులు విషాదాంతంగా మారుతున్నాయి.

టాలీవుడ్ దర్శకుడు సుబ్బు తల్లి మంగమ్మ కరోనా బారినపడగా, ఆమెకు సకాలంలో ఐసీయూ బెడ్ దొరక్క మృత్యువాతపడ్డారు. ఒక ఐసీయూ బెడ్ కోసం దర్శకుడు సుబ్బు తీవ్రంగా ప్రయత్నించారు. అయినప్పటికీ ప్రయోజనం లేకపోవడంతో మంగమ్మ అత్యంత బాధాకర పరిస్థితుల్లో కన్నుమూశారు.

సాయితేజ్ హీరోగా వచ్చిన 'సోలో బ్రతుకే సో బెటర్' చిత్రానికి దర్శకత్వం వహించిన సుబ్బు తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నాడు. కాగా, సుబ్బు తల్లికి ఐసీయూ బెడ్ కోసం ఎంతో ప్రయత్నించినా కాపాడుకోలేకపోయామని హీరో సాయితేజ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.