రఘురామకృష్ణరాజును చంపేస్తారేమోననే అనుమానాలు కలిగాయి: చంద్రబాబు

17-05-2021 Mon 18:15
  • రఘురాజు విమర్శలను, వైసీపీ విమర్శలను పోల్చి చూడాలి
  • అసెంబ్లీలో నాపై కూడా వైసీపీ సభ్యులు దుర్భాషలాడారు
  • మనుషుల ప్రాణాలతో ఆడుకుంటారా?
 There were suspicions that Raghuram Krishnaraja would be killed says Chandrababu

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజును ఏపీ సీఐడీ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. కస్టడీలో తనను పోలీసులు తీవ్రంగా హింసించారని, తనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారని సుప్రీంకోర్టు దృష్టికి కూడా ఆయన తీసుకెళ్లిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జరుగుతున్న పరిణామాలపై టీడీపీ అధినేత చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు.

రఘురాజు చేసిన విమర్శలను, వైసీపీ నేతల విమర్శలను పోల్చి చూడాలని చెప్పారు. అసెంబ్లీలో తనను కూడా వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు దుర్భాషలాడారని అన్నారు.  రఘురాజును చంపేస్తారేమోననే అనుమానాలు అందరిలో కలిగాయని చెప్పారు. మనుషుల ప్రాణాలతో ఎలా ఆడుకుంటారని ప్రశ్నించారు.

మరోవైపు రఘురాజుకి సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రిలో చికిత్స అందించాలని సుప్రీంకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. ముగ్గురు వైద్యులతో బోర్డును ఏర్పాటు చేసి, పరీక్షలు నిర్వహించాలని పేర్కొంది. అనంతరం సీల్డ్ కవర్ లో రిపోర్టును ఇవ్వాలని తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ కు ఆదేశాలు జారీ చేసింది. జ్యూడీషియల్ అధికారిని నియమించాలని, ఆయన సమక్షంలో వైద్య పరీక్షలను నిర్వహించాలని టీఎస్ హైకోర్టును ఆదేశించింది.