మరోసారి వరుణ్ తేజ్ జోడీగా సాయిపల్లవి?

17-05-2021 Mon 18:00
  • 'ఫిదా'ను మరిచిపోని ప్రేక్షకులు
  • తెరపై మళ్లీ కనిపించనున్న జంట
  • దర్శకుడిగా వెంకీ కుడుముల
  • మరో ప్రేమకథకి సన్నాహాలు    
Sai pallavi and Varun Tej in Venky Kudumula movie

సాయిపల్లవికి యూత్ లోను ... ఫ్యామిలీ ఆడియన్స్ లోను విపరీతమైన క్రేజ్ ఉంది. ఆమె సినిమా వస్తుందంటేనే అందరిలో ఆసక్తి పెరుగుతూ పోతుంటుంది. ఆమె నటించిన 'ఫిదా' సినిమాను ప్రేక్షకులు ఇంకా మరిచిపోలేదు. ఆ సినిమా తరువాత ఆమె శేఖర్ కమ్ముల కాంబినేషన్లో 'లవ్ స్టోరీ' చేసింది. ఆ సినిమా విడుదలకి ముస్తాబై .. థియేటర్లు ఎప్పుడు తెరుచుకుంటాయా అని ఎదురుచూస్తోంది. ఇక ఇప్పుడు ఆమె 'ఫిదా' హీరోతోనే మరోసారి జోడీ కట్టనుందనేది తాజా సమాచారం.

ప్రేమకథా చిత్రాలను యూత్ మెచ్చేలా తెరకెక్కించడంలో దర్శకుడు వెంకీ కుడుముల తనదైన ప్రత్యేకతను చాటుకున్నాడు. 'ఛలో' .. 'భీష్మ' సినిమాలు అందుకు నిదర్శనంగా కనిపిస్తాయి. ఇటీవల ఆయన వరుణ్ తేజ్ కి ఒక కథ వినిపించడం .. ఆయన ఓకే చెప్పేయడం జరిగిపోయాయనే టాక్ వచ్చింది. ఈ సినిమాలో కథానాయికగా సాయిపల్లవినే సంప్రదిస్తున్నారనేది తాజా సమాచారం. ఇటు వెంకీ కుడుముల .. అటు వరుణ్ ఇద్దరూ హిట్ల మీదే ఉన్నారు. అందువలన ఆమె గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ఖాయమనే టాక్ బలంగానే వినిపిస్తోంది. 'గని' తరువాత వరుణ్ చేసే ప్రాజెక్ట్ ఇదేనని అంటున్నారు.