అనుమానమే అక్కర్లేదు... అత్యంత బలహీన ప్రధాని మోదీనే: అసదుద్దీన్ ఒవైసీ

17-05-2021 Mon 17:40
  • చైనా దురాక్రమణలపై మీడియాలో కథనం
  • ఘాటుగా స్పందించిన ఎంఐఎం అధినేత
  • మోదీ ఏం చేస్తున్నారంటూ ఆగ్రహం
  • ఎంతో నిర్లిప్తంగా వ్యవహరిస్తున్నారని విమర్శలు
  • మోదీని క్షమించలేమని వ్యాఖ్యలు
Asaduddin Owaisi describes Modi weakest PM for India

భారత సరిహద్దు ప్రాంతాల్లో చైనా దురాక్రమణల అంశంపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. మన భూభాగాన్ని చైనా ఆక్రమిస్తుంటే ప్రధానిగా ఉన్న నరేంద్ర మోదీ ఏంచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చైనాను నిలువరించడంలో మోదీ విఫలం అయ్యారని, ప్రధాని హోదాలో ఉండి అత్యంత ఉదాసీనంగా వ్యవహరించిన ఆయనను ఏమాత్రం క్షమించలేమని వ్యాఖ్యానించారు.

సందేహమే అక్కర్లేదని, అత్యంత బలహీన భారత ప్రధాని నరేంద్ర మోదీనే అని ఒవైసీ విమర్శించారు. కఠిన పదజాలంతో కూడిన సుదీర్ఘ ప్రసంగాలు చైనాను కట్టడి చేయవచ్చని ఆయన భావిస్తున్నట్టుంది అని ఎద్దేవా చేశారు. భారతదేశ ఘనతర ప్రతిష్ఠకు, జాతీయ భద్రతకు ఇంత సుదీర్ఘకాలం పాటు మరే ప్రధాని కూడా నష్టం కలిగించిన దాఖలాలు లేవని పేర్కొన్నారు. మీడియాలో వచ్చిన ఓ కథనంపై స్పందిస్తూ ఒవైసీ ఈ వ్యాఖ్యలు చేశారు.