గాలి ద్వారా కూడా కరోనా వ్యాపిస్తుంది.. చక్కని వెంటిలేషన్ ఒక్కటే మార్గం: యూఎస్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్

17-05-2021 Mon 16:58
  • వైరస్ తేలిక కణాలు గాల్లో ఉంటాయి
  • గాలి వేగం, తేమ, ఉష్ణోగ్రతను బట్టి ప్రయాణిస్తుంటాయి
  • గదుల్లో గాలి, వెలుతురు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి
Corona Virus spreads through air says scientists

కరోనా వైరస్ గాలి ద్వారా కూడా వ్యాపిస్తుందని యూఎస్ సెంటర్ ఫర్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ తెలిపింది. ఈ నేపథ్యంలో కరోనా వ్యాప్తిని తగ్గించడానికి వెంటిలేషన్ ఒకటే మార్గమని చెప్పింది. ఈ పరిస్థితుల్లో వెంటిలేషన్ వ్యవస్థలో కూడా మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందని సూచించింది. ఇంటిలోపల గాలి స్వచ్ఛంగా ఉండటం వల్ల కరోనా వైరస్ మాత్రమే కాకుండా, ఇతర ఫ్లూలు, శ్వాససంబంధ ఇన్ఫెక్షన్లను కూడా తగ్గించొచ్చని తెలిపింది.

ఇండోర్ వెంటిలేషన్ ను మెరుగుపరచడం ద్వారా అంటువ్యాధులను నివారించవచ్చని శాస్త్రవేత్తలు చెప్పారు. తుమ్మడం, దగ్గడం, మాట్లాడటం వంటివి చేసినప్పుడు కరోనా సోకిన వ్యక్తి ముక్కు, గొంతు నుంచి వైరస్ కణాలు బయటకు విడుదలవుతాయని... అందులోని పెద్ద కణాలు వేగంగా కిందకు పడిపోతాయని, చిన్న కణాలు మాత్రం గాల్లో ఉండిపోతాయని తెలిపారు.

ఈ తేలికపాటి కణాలు గాలి వేగం, తేమ, ఉష్ణోగ్రతను బట్టి ప్రయాణిస్తుంటాయని చెప్పారు. ఇవి గాల్లో ఎక్కువ సేపు ఉంటాయని.. గదుల్లో మరింత వేగంగా వ్యాపిస్తాయని తెలిపారు. ఈ కణాలే ప్రజలకు ప్రమాదకరంగా మారుతున్నాయని... భవనాలు, ఇళ్లు, గదుల్లో వెంటిలేషన్ ను పెంచడం ద్వారా ఈ ప్రమాదాన్ని ఎక్కువ మేర అరికట్టవచ్చని చెప్పారు. గదుల్లో గాలి, వెలుతురు ఎక్కువగా ఉండేలా చూడాలని తెలిపారు. ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే రాబోయే రోజులు మరింత ప్రమాదకరంగా ఉండొచ్చని హెచ్చరించారు.