Beersheba Cricket Club: హమాస్ దాడుల నేపథ్యంలో భారత పరిశోధకులను అక్కున చేర్చుకున్న ఇజ్రాయెల్ క్రికెట్ క్లబ్

  • ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య భగ్గుమన్న విభేదాలు
  • వారం రోజులుగా తీవ్రస్థాయిలో దాడులు
  • టెల్ అవీవ్ పై రాకెట్ల వర్షం కురిపిస్తున్న హమాస్
  • ఓ వర్సిటీలో చిక్కుకుపోయిన భారత రీసెర్చర్లు
  • కాపాడిన బీర్షెబా క్రికెట్ క్లబ్
Israel Cricket Club saves Indian Researchers amidst Hamas Rocket fire

ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య కొన్నిరోజులుగా తీవ్రస్థాయిలో దాడులు, ప్రతిదాడులు జరుగుతున్నాయి. హమాస్ ఉగ్రవాద సంస్థ ఇజ్రాయెల్ ను లక్ష్యంగా చేసుకుని నిత్యం రాకెట్ దాడులకు పాల్పడుతోంది. హమాస్ దాడుల నేపథ్యంలో ఇజ్రాయెల్ లోని బెన్ గురియన్ యూనివర్సిటీలో పలువురు భారత పరిశోధకులు చిక్కుకుపోయారు. గాజా నుంచి పరంపరగా దూసుకువస్తున్న రాకెట్ల నుంచి కాపాడుకునేందుకు సరైన రక్షణ లేక వారు అల్లాడిపోయారు.

ఈ నేపథ్యంలో వారికి అనూహ్యరీతిలో ఆశ్రయం లభించింది. యూనివర్సిటీ పక్కనే ఉన్న బీర్షెబా క్రికెట్ క్లబ్ భారత పరిశోధకులను అక్కున చేర్చుకుంది. నెగెవ్ దక్షిణ ప్రాంతంలోని ఈ క్రికెట్ క్లబ్ కు చెందిన రెండంతస్తుల భవనంలో భూగర్భంలో తలదాచుకునే ఏర్పాటు కూడా ఉంది. హమాస్ రాకెట్ దాడులకు తెరదీయగానే బీర్షెబా క్రికెట్ క్లబ్ స్థానికులకు కూడా తన బంకర్ లో ఆశ్రయం కల్పించింది. ఇక, భారత పరిశోధకులు యూనివర్సిటీలో చిక్కుకుపోయారని తెలియడంతో క్రికెట్ క్లబ్ యాజమాన్యం వెంటనే స్పందించింది.

భారత పరిశోధకుల్లో కొందరు తమ క్లబ్ లో క్రికెట్ ఆడేందుకు వస్తుంటారని, వారు తమ కుటుంబ సభ్యుల వంటివారని బీర్షెబా క్రికెట్ క్లబ్ చైర్మన్ నవోర్ గుడ్కెర్ వెల్లడించారు. అందుకే వారం రోజులుగా వారికి ఆశ్రయం కల్పిస్తున్నామని, అన్ని విధాలా సాయం చేస్తున్నామని వివరించారు. భారత పరిశోధకులకు ఇక్కడి పరిస్థితుల గురించి తెలియదని, దాంతో, ఇక్కడ తీసుకోవాల్సిన జాగ్రత్తలపై తాను, తన సహచరులు వారికి అవగాహన కల్పిస్తున్నామని గుడ్కెర్ పేర్కొన్నారు.

కాగా, కష్టకాలంలో తమను ఆదుకున్న క్రికెట్ క్లబ్ యాజమాన్యానికి భారత పరిశోధకులు విరాజ్ భింగార్దివే, హీనా ఖంద్, శశాంక్ శేఖర్, రుద్రారు సేన్ గుప్తా, బిష్ణు ఖంద్, అంకిత్ చౌహాన్ కృతజ్ఞతలు తెలిపారు. కొన్నిరోజుల ముందు కేరళకు చెందిన సౌమ్య సంతోష్ అనే భారత మహిళ హమాస్ రాకెట్ దాడుల్లో మృతి చెందడం తెలిసిందే.

More Telugu News