సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రిలో రఘురాజుకు వైద్య పరీక్షలు.. సుప్రీంకోర్టు ఆదేశాలు

17-05-2021 Mon 14:19
  • ఒక జ్యుడీషియల్ అధికారిని తెలంగాణ హైకోర్టు నియమించాలి
  • వైద్య పరీక్షలను వీడియో తీయాలి
  • వైద్య పరీక్షల నివేదికను సీల్డ్ కవర్ లో అందించాలి
Supreme Court orders to send Raghu Rama Krishna Raju to Secunderabad Army Hospital

వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజును వైద్య పరీక్షల నిమిత్తం సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రికి తరలించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఆర్మీ ఆసుపత్రి వైద్య ఖర్చులను రఘురాజు భరించాలని చెప్పింది. ఈ పరీక్షల సమయాన్ని జ్యుడీషియల్ కస్టడీగానే భావించాలని పేర్కొంది. రఘురాజు వైద్య పరీక్షలను పర్యవేక్షించేందుకు జ్యుడీషియల్ ఆఫీసర్ ను తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ నియమించాలని ఆదేశించింది.

ఆర్మీ ఆసుపత్రి వైద్య పరీక్షల నివేదికను సీల్డ్ కవర్ లో అందించాలని సుప్రీంకోర్టు చెప్పింది. రఘురాజుకు చేసే పరీక్షలను వీడియోగ్రఫీ తీయాలని పేర్కొంది. ఈ మేరకు ఏపీ చీఫ్ సెక్రటరీ, తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రార్ కు ఆదేశాలు జారీ చేసింది. తమ ఆదేశాలను ఏపీ చీఫ్ సెక్రటరీ పాటించాలని చెప్పింది.

దీంతోపాటు ముగ్గురు సభ్యులతో మెడికల్ బోర్డును ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఈరోజే రఘురాజును సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రికి తరలించాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఢిల్లీ హైకోర్టు ఆదేశాలతో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన వై కేటగిరీ సెక్యూరిటీ రఘురాజు ఆర్మీ ఆసుపత్రికి వెళ్లేంత వరకే తోడుంటుందని చెప్పింది. ఆసుపత్రిలో వైద్య పరీక్షలు, చికిత్స సమయంలో ఈ సెక్యూరిటీ అవసరం లేదని తెలిపింది.  

ఆయన మెడికల్ రిపోర్టును తెలంగాణ హైకోర్టు తమకు పంపాలని ఆదేశించింది. తాము తదుపరి ఉత్తర్వులను జారీ చేసేంత వరకు రఘురాజును ఆర్మీ ఆసుపత్రిలోనే ఉంచాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో, సుప్రీంకోర్టు తీర్పు కాపీ రాగానే రఘురాజును గుంటూరు నుంచి సికింద్రాబాదుకు తరలించనున్నారు. మరోవైపు తదుపరి విచారణను సుప్రీంకోర్టు ఈనెల 21కి వాయిదా వేసింది.