WHO: ఎక్కువ గంటలు పని చేస్తే ప్రాణాంతకమే: ప్రపంచ ఆరోగ్య సంస్థ అధ్యయనం హెచ్చరిక

  • అంతర్జాతీయ కార్మిక సంస్థతో కలిసి అధ్యయనం
  • ఏటా లక్షలాది మంది మరణిస్తున్నారని ఆందోళన
  • వారంలో 55 గంటల కన్నా ఎక్కువ పనిచేస్తే డేంజర్
  • అధిక పని గంటలతో 2016లో 7.45 లక్షల మంది బలి
  • బాధితుల్లో పురుషులే 72% మంది
Long Working Hours Are A Killer WHO Study Shows

ఎక్కువ పని వేళలూ ప్రాణాంతకమని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ వో) హెచ్చరించింది. ఎక్కువ పని గంటల వల్ల ఏటా కొన్ని లక్షల మంది మరణిస్తున్నారని వెల్లడించింది. కరోనా మహమ్మారి సమయంలో అది మరింత ముదిరే ముప్పు ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. ప్రపంచంలోనే తొలిసారిగా దీనిపై అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్ వో)తో కలిసి చేసిన అధ్యయన నివేదికను డబ్ల్యూహెచ్ వో ఈరోజు విడుదల చేసింది.

ఎక్కువ గంటలు పనిచేయడం వల్ల గుండెపోటు, ఇతర గుండె జబ్బుల సమస్యలతో 2016లో 7.45 లక్షల మంది చనిపోయినట్టు పేర్కొంది. 2000వ సంవత్సరం నుంచి పోలిస్తే అది 30 శాతం ఎక్కువైందని వెల్లడించింది. వారానికి 55 గంటలు లేదా అంతకన్నా ఎక్కువ పనిచేస్తే ఆరోగ్యానికి పెనుముప్పు తప్పదని డబ్ల్యూహెచ్ వో పర్యావరణ విభాగం డైరెక్టర్ మరియా నీరా హెచ్చరించారు.

చనిపోతున్న వారిలో ఎక్కువగా పురుషులే ఉంటున్నారని చెప్పారు. ఎక్కువ పనిగంటల వల్ల 72% మంది పురుషులు మరణిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అందులోనూ ఎక్కువ మంది మధ్య వయస్కుల వారేనన్నారు. ఆగ్నేయాసియా, పశ్చిమ పసిఫిక్ ప్రాంతంలోని ప్రజలే ఎక్కువగా బాధితులవుతున్నారని పేర్కొన్నారు.

194 దేశాలపై చేసిన అధ్యయనంలో 55 కన్నా ఎక్కువ గంటలు పనిచేస్తున్న వారిలో గుండెపోటుతో మరణించే ముప్పు 35 శాతం ఎక్కువని తేల్చారు. హృదయ సంబంధ వ్యాధులతో చనిపోయే ముప్పు 17 శాతం అధికమని గుర్తించారు. 35 నుంచి 40 గంటల వరకు పనిచేసే వారితో పోలిస్తే ఎక్కువ గంటలు పనిచేసే వారికి ముప్పు ఎక్కువని తేల్చారు.

ప్రపంచవ్యాప్తంగా 9 శాతం మంది ప్రజలు ఎక్కువ గంటలు పనిచేస్తున్నారని గుర్తించారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో డబ్ల్యూహెచ్ వో చీఫ్ టెడ్రోస్ అధనోం ఘెబ్రియేసస్ సహా సిబ్బంది అంతా ఎక్కువ సేపు పనిచేయాల్సి వస్తోందని, ఈ అధ్యయనం నేపథ్యంలో పని గంటలకు సంబంధించి కొత్త విధానాలను రూపొందిస్తామని నీరా చెప్పారు.

సంస్థలూ పని గంటలను తగ్గిస్తే ఆ సంస్థలకే మేలు జరుగుతుందని, ఇటీవలి అధ్యయనాల్లోనూ అది తేలిందని ఆమె గుర్తు చేశారు. 2000 నుంచి 2016 మధ్య గల పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని అధ్యయనం చేశారు.

More Telugu News