Sputnik V: భార‌త్‌లో స్పుత్నిక్-వీ వ్యాక్సినేష‌న్ డ్రైవ్ ప్రారంభం.. తొలి డోసు వేయించుకున్న రెడ్డీస్ ల్యాబ్స్ సిబ్బంది

  • ర‌ష్యా అభివృద్ధి చేసిన స్పుత్నిక్-వీ వ్యాక్సిన్ దిగుమ‌తి
  • సాఫ్ట్ లాంచ్‌ను ఆవిష్క‌రించిన‌ అపోలో ఆసుప‌త్రి
  • హైదరాబాద్ తో పాటు విశాఖపట్నంలో ఏక‌కాలంలో వ్యాక్సినేష‌న్
sputnik v drive begins in india

ర‌ష్యా అభివృద్ధి చేసిన స్పుత్నిక్-వీ వ్యాక్సిన్ ఫస్ట్‌బ్యాచ్, సెకండ్ బ్యాచ్‌ డోసులు ఇటీవ‌లే పెద్ద ఎత్తున‌ హైద‌రాబాద్‌కు చేరుకున్న విష‌యం తెలిసిందే. వాటిని రెడ్డీస్‌ ల్యాబ్స్ కు తరలించారు. ఈ క్రమంలో స్పుత్నిక్‌-వీ వ్యాక్సినేష‌న్ డ్రైవ్ ఈ రోజు ప్రారంభ‌మైంది. దీనికి సంబంధించిన సాఫ్ట్ లాంచ్‌ను అపోలో ఆసుప‌త్రి ఈ రోజు ఉద‌యం ఆవిష్క‌రించింది.

డా. రెడ్డీస్ కు చెందిన‌ సిబ్బంది అశోక్‌కు స్పుత్నిక్-వీ మొదటి డోసును వేశారు. డాక్టర్ రెడ్డీస్ భాగస్వామ్యంతో అపోలో గ్రూప్ ఆసుపత్రుల్లో వాక్సినేషన్ పైలెట్ ప్రాజెక్ట్ ను ప్రారంభించారు. ఈ కార్య‌క్ర‌మంలో అపోలో గ్రూప్ ప్రెసిడెంట్ డా. కె.హరిప్రసాద్ తో పాటు డా.రెడ్డీస్ సీఈవో ఎంవీ రమణ కూడా పాల్గొన్నారు.

హైదరాబాద్ తో పాటు విశాఖపట్నం‌లో కూడా ఏక‌కాలంలో ఈ వ్యాక్సినేష‌న్ డ్రైవ్ ప్రారంభ‌మైంది. వ‌చ్చే నెల‌ నుంచి దేశంలోనే స్పుత్నిక్-వీ వ్యాక్సిన్లను రెడ్డీస్‌ ల్యాబ్స్ ఉత్ప‌త్తి చేయ‌నుంది. కాగా, స్పుత్నిక్‌-వీ వ్యాక్సిన్‌ అత్యవసర వినియోగానికి డీసీజీఐ ఇప్ప‌టికే అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే.

దిగుమ‌తి చేసుకున్న స్పుత్నిక్-వీ ఒక్కో డోస్ ధర రూ.995గా ఉంటుందని ఇప్ప‌టికే ప్ర‌క‌ట‌న వ‌చ్చింది. దేశంలో ఈ వ్యాక్సిన్ ఉత్ప‌త్తి ప్రారంభ‌మ‌య్యాక దాని ధ‌ర త‌‌గ్గుతుంది.

More Telugu News