సమస్యను ఆ రెండు దేశాలే చర్చలతో పరిష్కరించుకోవాలి: ఇజ్రాయెల్, పాలస్తీనా హింసపై భారత్

17-05-2021 Mon 12:10
  • ప్రస్తుత పరిస్థితుల్లో పాలస్తీనాకే మద్దతు 
  • హింస, వినాశనానికి వ్యతిరేకమని స్పష్టీకరణ 
  • చర్చల ద్వారానే అది సాధ్యమని వెల్లడి
  • రెండు వర్గాలూ దాడులు ఆపేయాలని సూచన
  • ఐరాస సమావేశంలో భారత శాశ్వత రాయబారి
India voices support for Palestines cause at UN meet bats for two state resolution

ఇజ్రాయెల్ దాడులుతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న పాలస్తీనాకు భారత్ మద్దతు ప్రకటించింది. తామెప్పుడు హింస, రెచ్చగొట్టడం, వినాశనానికి వ్యతిరేకమేనని తేల్చి చెప్పింది. అయితే, సమస్యను ఆ రెండు దేశాలే చర్చలతో పరిష్కరించుకోవాలని స్పష్టం చేసింది. ఆదివారం నిర్వహించిన ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి సమావేశంలో ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి, రాయబారి టి.ఎస్. తిరుమూర్తి మాట్లాడారు.

వారం క్రితం జెరూసలెంలో మొదలైన ఘర్షణ.. ఇప్పుడు చిలికి చిలికి గాలివానలా మారిందని, ఘర్షణలు అదుపు తప్పాయని అన్నారు. భద్రతా పరిస్థితులు ఇప్పుడు క్షీణించిపోయాయని అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో పాలస్తీనాకే మద్దతిస్తున్నామని, అయితే, రెండు దేశాలే సమస్యను పరిష్కరించుకోవాలని, అందుకు తమ మద్దతు ఎప్పుడూ ఉంటుందని స్పష్టం చేశారు.

రెండు వర్గాలూ వెంటనే దాడులను ఆపాలని హితవు చెప్పారు. తూర్పు జెరూసలెం, పొరుగు ప్రాంతాలపై కుదిరిన స్టేటస్ కోకు రెండు దేశాలూ కట్టుబడి ఉండాలని పేర్కొన్నారు. ప్రస్తుతమున్న పరిస్థితులు ఇజ్రాయెల్, పాలస్తీనాలు మరోసారి చర్చలకు కూర్చోవాల్సిన అవసరాన్ని తెలియజేస్తున్నాయని ఆయన అన్నారు. చర్చలు లేకపోవడం వల్లే రెండు దేశాల మధ్య విశ్వాసం సన్నగిల్లుతోందన్నారు.

గాజా నుంచి ఇజ్రాయెల్ పై దాడులు చేయడాన్నీ తాము ఖండిస్తున్నామని చెప్పారు. ప్రజలే లక్ష్యంగా దాడులు చేయడం తగదన్నారు. దానికి ప్రతీకారంగా ఇజ్రాయెల్ చేసిన దాడులతో భారీ ప్రాణ నష్టం సంభవిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. అమాయక చిన్నారులూ ప్రాణాలు పోగొట్టుకోవాల్సి వస్తోందన్నారు.

హమాస్ చేసిన దాడుల్లో భారత పౌరురాలూ చనిపోయిన విషయాన్ని తిరుమూర్తి గుర్తు చేశారు. దాడుల్లో మరణించిన వాందరికీ సంతాపం ప్రకటించారు.