హిట్ మూవీలో పవర్ఫుల్ రోల్ వదులుకున్న రవితేజ!

17-05-2021 Mon 11:00
  • తమిళనాట 'వడా చెన్నై' హిట్
  • రవితేజను అడిగిన దర్శకుడు
  • చేయలేకపోయిన రవితేజ
  • తాజాగా బయటికి వచ్చిన విషయం  
Raviteja rejected a good role in Vada Chennai

కోలీవుడ్ లో వైవిధ్యభరితమైన కథాచిత్రాల దర్శకుడిగా వెట్రి మారన్ కు మంచి పేరు ఉంది. ఆయన సినిమాల్లో కథాకథనాలు బలంగా ఉంటాయనీ .. పాత్రల నడక కొత్తగా ఉంటుందని ప్రేక్షకులు భావిస్తారు. గతంలో ధనుశ్ హీరోగా ఆయన 'వడా చెన్నై' అనే సినిమాను తెరకెక్కించాడు. 2018లో వచ్చిన ఈ సినిమా అక్కడ భారీ వసూళ్లను రాబట్టింది. ఈ సినిమాలో ఆమీర్ సుల్తాన్ ఒక కీలకమైన పాత్రను చేశాడు. ఆయన పాత్ర కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఆయనకంటే ముందుగా ఆ పాత్ర కోసం రవితేజను అడిగారట.

తాజా ఇంటర్వ్యూలో వెట్రి మారన్ మాట్లాడుతూ .. "ఈ సినిమాలో ధనుశ్ పాత్ర తరువాత అంతటి ప్రాధాన్యత స్మగ్లర్ రాజన్ పాత్రకి ఉంటుంది. ఆ పాత్రను గురించి విజయ్ సేతుపతికి చెప్పాను. కథ .. పాత్ర రెండూ బాగున్నాయని చెప్పిన విజయ్ సేతుపతి, డేట్స్ సర్దుబాటు కాని కారణంగా ఆ సినిమా చేయలేకపోయాడు.

 ఆ తరువాత రవితేజ అయితే బాగుంటాడని భావించి ఆయనను సంప్రదించాను. రవితేజకు కూడా కథ చాలా బాగా నచ్చింది. కానీ ఆల్రెడీ ఆయన చాలా ప్రాజెక్టులు లైన్లో పెట్టిన కారణంగా చేయలేకపోయారు" అని చెప్పుకొచ్చారు. అలా రవితేజ ఒక హిట్ మూవీలో మంచి ఛాన్స్ వదులుకున్నాడన్న మాట.