రేపు తెరుచుకోనున్న కేదార్‌నాథ్‌ ఆలయం

16-05-2021 Sun 22:23
  • పూర్తయిన ఆలయ అలంకరణ
  • కరోనా కారణంగా భక్తులకు నో ఎంట్రీ
  • వరుసగా రెండో ఏడాది చార్‌ధామ్‌ యాత్ర నిలిపివేత
  • వరుసగా తెరుచుకోనున్న యుమునోత్రి, గంగోత్రి, కేదార్‌నాథ్‌, బద్రీనాథ్‌ ఆలయాలు
Kedarnath temple will be opened tomorrow

చార్‌ధామ్ దేవాలయాల్లో ఒకటైన హిమాలయాల్లోని కేదార్‌నాథ్‌ ఆలయ ద్వారాలు తెరచుకోనున్నాయి. సోమవారం ఆలయంలో పూజలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ఇప్పటికే ఆలయాన్ని పుష్పాలంకరణతో సర్వాంగ సుందరంగా తీర్చి దిద్దారు. అయితే, కరోనా నేపథ్యంలో భక్తులకు మాత్రం అనుమతి లేదు. కేవలం ఆన్‌లైన్‌ దర్శనం మాత్రమే అందుబాటులో ఉంది.

ప్రతి ఏడాది శీతాకాలంలో 6 నెలల పాటు మూసి ఉండే చార్‌ధామ్‌ ఆలయాలు వేసవిలో తెరుచుకుంటాయి. కానీ, కరోనా కారణంగా గత ఏడాదితో పాటు ఈసారి కూడా చార్‌ధామ్‌ యాత్రను ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం రద్దు చేసింది. గత ఏడాది నుంచి ఆన్‌లైన్‌ పోర్టల్‌లో మాత్రమే పూజలు నిర్వహిస్తున్నారు. చార్‌ధామ్‌ ఆలయాల్లో ముందుగా యుమునోత్రిని తెరుస్తారు. శుక్రవారం ఈ ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయి. శనివారం గంగోత్రి, సోమవారం కేదార్‌నాథ్‌, మంగళవారం బద్రీనాథ్‌ ఆలయాలు తెరుచుకోనున్నాయి.