కొనసాగుతున్న ఇజ్రాయెల్‌-పాలస్తీనా ఘర్షణలు.. గాజాలో ఒక్కరోజే 42 మంది మృతి!

16-05-2021 Sun 21:57
  • వారం రోజులుగా కొనసాగుతున్న ఘర్షణలు
  • ఏమాత్రం సద్దుమణగని వైనం
  • దాడులు కొనసాగుతాయని నెతన్యాహు స్పష్టం
  • నేల మట్టమైన మూడు భారీ భవనాలు
Israel Palastine conflict 42 dead in gaza ina a single day

ఇజ్రాయెల్‌, పాలస్తీనా మధ్య ఘర్షణలు ప్రారంభమై వారం కావస్తోంది. ఇప్పటి వరకు పరిస్థితులు ఏమాత్రం సద్ధుమణగ లేదు. పైగా మరింత తీవ్రమయ్యే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇజ్రాయెల్‌ వైమానిక దాడులతో గాజా వణికిపోతుండగా.. హమాస్‌ చేస్తున్న రాకెట్‌ దాడులు ఇజ్రాయెల్‌ ప్రజలను తీవ్రంగా కలవరపెడుతున్నాయి.

ఈ నేపథ్యంలో ఘర్షణలు ప్రారంభమైన తర్వాత ఆదివారం గాజా చరిత్రలోనే అత్యంత దారుణమైన రోజుగా మిగిలిపోయింది. ఇజ్రాయెల్‌ జరిపిన వైమానిక దాడుల్లో ఆదివారం ఒక్కరోజే గాజాలో ఏకంగా 42 మంది చనిపోయారు. వీరిలో 16 మంది మహిళలు, 10 మంది చిన్నారులు ఉన్నట్లు గాజా ఆరోగ్య శాఖ వెల్లడించింది. మరో 50 మంది తీవ్రంగా గాయపడ్డట్లు తెలిపింది. దాడులు ప్రారంభమైన తర్వాత ఒక్కరోజే ఇంతమంది చనిపోవడం ఇదే తొలిసారి. మూడు భారీ భవనాలు నేలమట్టం అయ్యాయి.

అలాగే, హమాస్ ఉగ్రముఠాకు చెందిన కీలక నేత యాహియే సిన్వర్‌కు చెందిన ఇంటిని నేలమట్టం చేసినట్లు ఇజ్రాయెల్‌ ప్రకటించింది. మరోవైపు గాజాపై తమ దాడులు కొనసాగుతూనే ఉంటాయని ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజిమిన్‌ నెతన్యాహు తేల్చి చెప్పారు. ఇప్పటి వరకు ఇరు వర్గాల మధ్య రాజీ కుదిర్చేందుకు వివిధ దేశాలు, అంతర్జాతీయ సంస్థలు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి.