Sachin Tendulkar: ఓ దశలో తీవ్రమైన ఒత్తిడి ఎదుర్కొన్నా: సచిన్ టెండూల్కర్

  • 24 ఏళ్ల కెరీర్ పై సచిన్ వివరణ
  • పది, పన్నెండేళ్ల పాటు ఉద్వేగం సమస్యగా మారిందని వెల్లడి
  • పరిస్థితులను అంగీకరించడమే మార్గమని వ్యాఖ్యలు
  • చివరి మ్యాచ్ వరకు అదే పాటించానని స్పష్టీకరణ
Sachin Tendulker explains how he battled with anxiety

భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తన కెరీర్ లోని ఆసక్తికర అంశాలను మీడియాతో పంచుకున్నారు. తన 24 ఏళ్ల సుదీర్ఘ కెరీర్ లో ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపానని, సుమారు పది, పన్నెండేళ్ల పాటు ఎంతో ఉద్విగ్నత ఎదుర్కొన్నానని వివరించారు. నేడు మ్యాచ్ ఉందంటే ముందురోజు రాత్రి ఎంతో ఉద్వేగంతో గడిపేవాడ్నని, దాంతో రాత్రుళ్లు నిద్రకు కూడా దూరమయ్యేవాడ్నని తెలిపారు. పరిస్థితులను అంగీకరించడం ఎంతో ముఖ్యమైన అంశం అని వెల్లడించారు.

కరోనా పరిస్థితుల్లో ఆటగాళ్లు కుటుంబాలకు దూరంగా బయోబబుల్స్ లో గడుపుతూ మానసిక ఒత్తిళ్లకు గురవుతున్న నేపథ్యంలో సచిన్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

"మ్యాచ్ ప్రారంభం కాకముందే నాలో ఉద్వేగాలు తీవ్రస్థాయికి చేరేవి. కాలక్రమంలో పరిస్థితులు అర్థం చేసుకుంటూ మానసిక ప్రశాంతత పొందగలిగాను. ఓ మ్యాచ్ కు శారీరకంగా ఎలా సన్నద్ధమవుతామో, మానసికంగానూ సిద్ధం కావాలని తెలుసుకున్నాను. మ్యాచ్ కు ముందు కొత్త వ్యాపకాలు కల్పించుకోవడం మొదలుపెట్టాను.

షాడో బ్యాటింగ్, టీవీ చూడడం, వీడియోగేమ్స్ ఆడడం, ఉదయాన్నే టీ తాగడం, నా దుస్తులను నేనే ఇస్త్రీ చేసుకోవడం వంటి పనులతో మనసును ఉత్సాహంగా ఉంచుకునేవాడ్ని. మ్యాచ్ కు ముందు నా బ్యాగ్ నేనే సర్దుకునేవాడ్ని. ఇవన్నీ నా సోదరుడు నాకు నేర్పించాడు. ఆ తర్వాతే నాకు బాగా అలవాటైపోయింది. నా కెరీర్ లో చివరి మ్యాచ్ ఆడేముందు కూడా నేనివన్నీ పాటించాను" అని సచిన్ వివరించాడు.

More Telugu News