తక్షణమే రఘురామను జైలు నుంచి ఆసుపత్రికి తరలించండి: హైకోర్టు ఆదేశం

16-05-2021 Sun 19:22
  • రఘురామ వైద్య పరీక్షల నివేదికపై హైకోర్టులో విచారణ
  • వాదనలు పూర్తి
  • సీఐడీ కోర్టు ఆదేశాలు అమలు చేయాలన్న హైకోర్టు
  • రమేశ్ ఆసుపత్రిలో రఘురామకు వైద్య పరీక్షలు చేపట్టాలని ఉత్తర్వులు
High court orders in favour of Raghurama

ప్రభుత్వ వ్యతిరేక వ్యాఖ్యల కేసులో అరెస్టయిన ఎంపీ రఘురామకృష్ణరాజుకు స్వల్ప ఊరట కలిగింది. ఆయనను జైలు నుంచి ఆసుపత్రికి తరలించాలని ఏపీ హైకోర్టు సీఐడీ అధికారులను ఆదేశించింది. రఘురామను తక్షణమే రమేశ్ ఆసుపత్రికి పంపాలని స్పష్టం చేసింది. ఈ సాయంత్రం హైకోర్టులో రఘురామ వైద్య పరీక్షల నివేదికపై విచారణ జరిగింది. వైద్య పరీక్షల నివేదికను పరిశీలించిన స్పెషల్ డివిజన్ బెంచ్... రఘురామ తరఫు న్యాయవాదుల అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకుంది.

కాగా, రమేశ్ ఆసుపత్రిలో పరీక్షలు చేయాలన్న కోర్టు ఆదేశాన్ని పట్టించుకోలేదని రఘురామ తరఫు న్యాయవాదులు డివిజన్ బెంచ్ కు విన్నవించారు. కస్టడీలో ఉండగానే సీఐడీ అధికారి పిటిషనర్ (రఘురామ)ను కలిశారని, కస్టడీలో ఉండగా కలవడం చట్టవిరుద్ధమని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అటు, ప్రభుత్వ న్యాయవాది స్పందిస్తూ, రఘురామకు రిమాండ్ విధిస్తూ జడ్జి ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేశారని ప్రస్తావించారు. కొద్దిసేపటి క్రితమే వాదనలు పూర్తి కాగా, ధర్మాసనం కీలక నిర్ణయం తీసుకుంది. సీఐడీ కోర్టు నిన్న ఇచ్చిన ఆదేశాలను అమలు పర్చాలని ఆదేశించింది.