ఇండియన్‌-2 వివాదంతో ఆలోచనల్లో పడ్డ రామ చరణ్‌?

16-05-2021 Sun 19:02
  • లైకా సంస్థ నిర్మాణంలో ఇండియన్‌-2 తెరకెక్కిస్తున్న శంకర్‌
  • ప్రస్తుతం వీరివురి మధ్య వివాదం
  • మరోవైపు శంకర్‌ దర్శకత్వంలో సినిమాకు ఓకే చెప్పిన చెర్రీ
  • ఇండియన్‌-2 వివాదం సద్దుమణిగేందుకు సమయం
  • ఈలోపు మరో సినిమాపై దృష్టి పెట్టిన రామ్‌ చరణ్‌
  • గౌతమ్‌ తిన్ననూరి స్క్రిప్ట్‌ను ఓకే చేసే యోచనలో చెర్రీ
Ram charan in confusion after shakers indian2 conflict

ప్రస్తుతం జక్కన్న తెరకెక్కిస్తున్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ పనుల్లో ఉన్న మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ తర్వాత స్టార్ డైరెక్టర్‌ శంకర్‌ దర్శకత్వంలో ఓ పాన్‌ ఇండియా చిత్రాన్ని ప్లాన్‌ చేసుకున్నాడు. దీన్ని దిల్‌రాజ్‌ నిర్మించనున్నట్లు అధికారిక ప్రకటన కూడా వెలువడింది. అయితే, ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లేది ఎప్పుడన్న దానిపై ఇప్పుడు చర్చ జరుగుతోంది.

ఇండియన్‌-2 సినిమా విషయంలో డైరెక్టర్‌ శంకర్‌, లైకా నిర్మాణ సంస్థ మధ్య పెద్ద వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ సినిమా పూర్తి చేసే వరకు శంకర్‌ మరే సినిమా చేయకుండా చూడాలంటూ హిందీ, తెలుగు ఫిల్మ్‌ ఛాంబర్స్‌కు లైకా సంస్థ లేఖలు రాసింది. దీంతో రామ్‌ చరణ్‌, శంకర్‌ కలిసి చేయాల్సిన సినిమా ఆలస్యమయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ పరిణామాల నేపథ్యంలో వివాదం సద్దుమణిగే లోపు మరో సినిమాను పూర్తి చేయాలని రామ్‌ చరణ్‌ భావిస్తున్నారట. ఇండియన్‌-2 పూర్తి చేయడానికి మరో 6 నెలల సమయం పట్టొచ్చని సమాచారం. ఈలోపు చాలా రోజులుగా చర్చల్లో ఉన్న గౌతమ్‌ తిన్ననూరి ప్రాజెక్టును సెట్స్‌పైకి తీసుకెళ్లాలని అనుకుంటున్నారు. ఇండియన్‌-2 వివాదం సద్దుమణిగే లోపు దీన్ని ఫైనల్‌ చేసి షూటింగ్‌ పూర్తిచేయాలనుకుంటున్నారట చెర్రీ.  జెర్సీ సక్సెస్‌తో  గౌతమ్‌ హిట్‌ డైరెక్టర్ల జాబితాలో చేరిన విషయం తెలిసిందే.