రఘురామ మహానటుడు... తనకు తానే గాయాలు చేసుకుని బయటపడాలనుకుంటున్నాడు: అంబటి

16-05-2021 Sun 17:28
  • రఘురామను అరెస్ట్ చేసిన ఏపీ సీఐడీ
  • కోర్టులో హాజరు
  • నేడు జైలుకు తరలింపు
  • రఘురామ వ్యాఖ్యల వెనుక చంద్రబాబు ఉన్నాడన్న అంబటి
Ambati comments in Raghurama Krishna Raju and Chandrababu

నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజును ఏపీ సీఐడీ పోలీసులు అరెస్ట్ చేయడం, తదనంతరం ఆయన కోర్టులో కుంటుతూ నడవడం, తనను పోలీసులు దారుణంగా కొట్టారని ఆరోపించడం వంటి అంశాలపై వైసీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు స్పందించారు. రఘురామ మహానటుడు అని, తనకు తానే గాయాలు చేసుకుని ఈ కేసు నుంచి బయటపడాలని చూస్తున్నాడని అంబటి ఆరోపించారు. బెయిల్ పిటిషన్ కొట్టివేతకు గురైన వెంటనే రఘురామలో ఎంతమార్పు వచ్చిందో అడిషనల్ అడ్వొకేట్ జనరల్ వివరించారని తెలిపారు.

రఘురామ వెనకున్నది చంద్రబాబేనని అంబటి పేర్కొన్నారు. రఘురామ వ్యాఖ్యలు ఎంత తీవ్రమైనవో చెప్పాల్సింది న్యాయస్థానాలని, చంద్రబాబు కాదని అంబటి హితవు పలికారు. గత ఏడాది కాలంగా తెలుగుదేశం పార్టీతో జతకట్టిన రఘురామ ప్రభుత్వ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నాడని, ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు ప్రయత్నిస్తున్నాడని ఆరోపించారు. ఈ కేసులో చంద్రబాబు పాత్ర కూడా తేలాలని అన్నారు.

రఘురామ రాజద్రోహానికి పాల్పడినట్టు 46 సీడీలను సీఐడీ అధికారులు కోర్టుకు సమర్పించారని, అలాంటి చీడపురుగును చంద్రబాబు వెనకేసుకొస్తున్నారని అంబటి విమర్శించారు. రచ్చబండ అంటూ రఘురామకృష్ణరాజుతో నిత్యం బూతులు తిట్టించడం టీడీపీ నేతలకు, పలు చానళ్లకు అలవాటైందని అన్నారు. ఎంపీ అరెస్ట్ తో తమ కుట్రలు ఎక్కడ బయటపడతాయో అని చంద్రబాబు, పలు మీడియా సంస్థలు కలవరపాటుకు గురవుతున్నట్టు అంబటి విమర్శించారు.