Guidelines: గ్రామీణ, పట్టణ, గిరిజన ప్రాంతాలకు కొవిడ్ ఆరోగ్య మార్గదర్శకాలు జారీ చేసిన కేంద్రం

Centre issues new guidelines for rural and urban areas
  • పల్లెల్లో సెకండ్ వేవ్ బీభత్సం
  • కంటైన్మెంట్ మార్గదర్శకాలు రూపొందించిన కేంద్రం
  • తీవ్ర అనారోగ్యం, శ్వాససమస్యలపై నిఘా ఉంచాలని వెల్లడి
  • స్వల్ప లక్షణాలుంటే హోం ఐసోలేషన్
  • ఆక్సిజన్ స్థాయి పడిపోతే పెద్ద ఆసుపత్రికి తరలింపు
కరోనా సెకండ్ వేవ్ లో ఎక్కువగా గ్రామీణ ప్రాంతాలు ప్రభావితం అవుతుండడం పట్ల కేంద్రం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో గ్రామీణ, పట్టణ, గిరిజన ప్రాంతాల్లో కొవిడ్ కంటైన్మెంట్ నిర్వహణ మార్గదర్శకాలు జారీ చేసింది. కొవిడ్ బాధితుల సేవలకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని స్పష్టం చేసింది. గ్రామీణ ప్రజల్లో తీవ్ర అనారోగ్యం, శ్వాస సమస్యలపై నిఘా ఉంచాలని సూచించింది. ఆశా, ఆరోగ్య కార్యకర్తలతో కరోనా పరిస్థితులను పర్యవేక్షిస్తుండాలని, కొవిడ్ లక్షణాలు ఉన్నవారికి టెలీమెడిసిన్ సేవలు అందించాలని వివరించింది.

కరోనా సెకండ్ వేవ్ లో దాదాపు 85 శాతం మందిలో స్వల్ప లక్షణాలు ఉంటున్నాయని కేంద్రం పేర్కొంది. స్వల్ప లక్షణాల ఉన్నవారు హోం ఐసోలేషన్ లో చికిత్స పొందాలని తెలిపింది. కరోనా రోగుల ఆక్సిజన్ స్థాయులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తుండాలని తాజా మార్గదర్శకాల్లో స్పష్టం చేసింది. ఆక్సిజన్ స్థాయులు పడిపోతున్న వారిని పెద్ద ఆసుపత్రులకు తరలించాలని నిర్దేశించింది.

ర్యాపిడ్ పరీక్షలపై ఏఎన్ఎం, సీహెచ్ఓలకు శిక్షణ ఇవ్వాలని, అన్ని ప్రజారోగ్య కేంద్రాల్లో పరీక్ష కిట్లు అందుబాటులో ఉంచాలని సూచించింది. గ్రామాల్లో ఆక్సీమీటర్లు, థర్మామీటర్లు అందుబాటులో ఉంచాలని పేర్కొంది. ఆక్సీమీటర్లు వాడిన ప్రతిసారి శానిటైజ్ చేయాలని వెల్లడించింది. ఆశా, అంగన్ వాడీ, వలంటీర్ల ద్వారా సేవలు అందించాలని తెలిపింది. కరోనా బాధితులందరికీ హోం ఐసోలేషన్ కిట్లు అందించాలని తన మార్గదర్శకాల్లో వివరించింది.
Guidelines
Rural
Urban
India
Centre
Corona Pandemic

More Telugu News