Puri Jagannadh: ఆ అందమైన నగరం 2030 నాటికి దెయ్యాలగడ్డ అవుతుందట!

  • వెనిస్ గురించి పూరీ చెప్పిన చరిత్ర
  • చెత్త కుండీలూ అందంగా ఉంటాయన్న డైరెక్టర్
  • నగరం నీటిలో మునిగిపోతోందని వెల్లడి
  • 1.20 లక్షల నుంచి 60 వేలకు పడిపోయిన జనాభా
The Beautiful city on the earth puri musings explains about it

ఈ భూమ్మీదున్న నగరాల్లో వెనిస్ అందమైనదట. ఆ అందమైన నగరమే 2030 నాటికల్లా దెయ్యాల గడ్డగా మారుతుందట. అవును, స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ చెబుతున్న మాటలివి. పూరీ మ్యూజింగ్స్ ద్వారా ఆయన ఇటలీలోని వెనిస్ నగర చరిత్ర గురించి వివరించారు. ఇవీ ఆయన చెబుతున్న ఆ నగర విశేషాలు..

ఇటలీకి ఉత్తరాన నిర్మించిన వెనిస్ ను ఒకప్పుడు వెనిజియా అని పిలిచేవారని పూరీ చెప్పారు. 118 చిన్న ద్వీపాలను కలుపుతూ సిటీని కట్టారని, ప్రతి ద్వీపానికి మధ్యలో చిన్న చిన్న కాల్వలు ఉంటాయని, ఓ ఇంటి నుంచి మరో ఇంటికి వెళ్లాలంటే పడవలే శరణ్యమని చెప్పారు. ఆ పడవలను గండోలా అంటారని, ఒక్కో గండోలా 11 మీటర్ల పొడవుంటుందని వివరించారు.

అక్కడ బైకులుగానీ, కార్లుగానీ ఉండవన్నారు. చరిత్రకారుడు మార్కోపోలోది వెనిసేనన్నారు. అక్కడి చెత్త కుండీలు కూడా అందంగా ఉంటాయన్నారు. ఇక్కడ కార్నివాల్ అతిపెద్ద పండుగని, ప్రతి ఒక్కరూ అందమైన మాస్కులు పెట్టుకుని సంబరాలు చేసుకుంటారని పూరీ చెప్పారు.

16వ శతాబ్దంలో కార్నివాల్ సందర్భంగా ఎవరైనా మొహానికి  మాస్క్ లేకుండా తిరిగితే రెండేళ్ల జైలు శిక్ష విధించేవాళ్లని, వారిని స్తంభానికి కట్టేసి కొట్టే వారని చెప్పారు. ఎస్ ఆకారంలో ఉండే చెరువు నగరాన్ని రెండుగా వేరు చేస్తుందన్నారు.

ప్రపంచంలోనే మొదటి కాసినో ఇక్కడే పెట్టారని, మొదటి మహిళా గ్రాడ్యుయేట్ ఇక్కడామేనని చెప్పారు. 1646లో ఆమె డిగ్రీ పూర్తి చేసిందన్నారు. ఇక, అతిపెద్ద పర్యాటక ప్రాంతంగా మారడంతో ప్రతి ఇల్లూ హోటల్ గానో లేదా రెస్టారెంట్ గానో మారిందని, దాని వల్ల స్థానికులకు ఇళ్లు అద్దెకు దొరకడం కష్టమైందని వివరించారు. ఒకప్పుడు లక్షా 20 వేలున్న జనాభా ఇప్పుడు 60 వేలకు పడిపోయిందన్నారు. ప్రస్తుతం ఆ నగరం నీటిలో మునిగిపోతోందని, 2030 నాటికి దెయ్యాల నగరంగా మారుతుందని అందరూ చెప్పుకొంటున్నారని అన్నారు.

More Telugu News