KKR: సాహితీ దిగ్గజం, భాషావేత్త కేకే రంగనాథాచార్యులును కాటేసిన కరోనా

  • కరోనాకు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి
  • హైదరాబాద్‌లోని సీతారాంబాగ్ ఆలయ ఆవరణలో పెరిగిన కేకేఆర్
  • విద్యార్థి దశ నుంచి విప్లవ రాజకీయాలతో మమేకం
Telugu linguist Ranganadhacharyulu passes away

తెలుగు సాహిత్యాభివృద్ధికి ఎంతగానో కృషి చేసిన సాహితీ దిగ్గజం కేకే రంగనాథాచార్యులను కరోనా కాటేసింది. సాహితీలోకం కేకేఆర్‌గా పిలిచే ఆచార్య కొవైల్ కందాళై రంగనాథాచార్యులు (80) కరోనాతో పోరాడుతూ కన్నుమూశారు. హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు. తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలో జన్మించిన ఆయన హైదరాబాద్‌లోని సీతారాంబాగ్ దేవాలయ ఆవరణలో పెరిగారు.

ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ పొందిన కేకేఆర్ రెండు దశాబ్దాలపాటు అధ్యాపకుడిగా, ప్రొఫెసర్‌గా, పరిషత్తు ప్రధాన కార్యదర్శిగా సేవలు అందించారు. ‘సారస్వత వేదిక’ పేరుతో ఆధునిక సాహిత్యంలో వివిధ అంశాలపై పన్నెండేళ్లపాటు సదస్సులు నిర్వహించారు. తర్వాత ఆ చర్చలను పుస్తక రూపంలో తీసుకొచ్చారు. కేకేఆర్‌పై వామపక్ష ఉద్యమ ప్రభావం కూడా ఉంది. విద్యార్థి దశ నుంచే విప్లవ రాజకీయాలతో మమేకమయ్యారు. ఆయనకు భార్య ఊర్మిళ, కుమారుడు సుమన్,  కుమార్తె సలిల ఉన్నారు.

ఆంధ్రజ్యోతి ఎడిటర్ కె.శ్రీనివాస్, ఎమెస్కో ప్రచురణల సంపాదకుడు డి.చంద్రశేఖర్‌రెడ్డి, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న కేకేఆర్ శిష్యులే. రంగనాథాచార్యుల మృతికి ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు జగన్, కేసీఆర్ సంతాపం తెలిపారు. రంగనాథాచార్యుల అంత్యక్రియలు నేడు జరగనున్నాయి.

More Telugu News