ఎంపీ శరీరంపై నిన్న లేని దెబ్బలు ఇవాళ ఎలా వచ్చాయి?: డివిజన్ బెంచ్

15-05-2021 Sat 20:45
  • రఘురామను అరెస్ట్ చేసిన ఏపీ సీఐడీ
  • ఎంపీ కేసు విచారణకు డివిజన్ బెంచ్ ఏర్పాటు
  • రఘురామ కాలి గాయాలను తీవ్రంగా పరిగణించిన బెంచ్ 
  • గాయాల నిర్ధారణకు మెడికల్ టీమ్
  • రిమాండ్ రిపోర్ట్ రద్దు చేయాలన్న రఘురామ న్యాయవాదులు
Division bench takes up Raghurama case hearing

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణ రాజు కేసును విచారించేందుకు ఏపీ హైకోర్టు డివిజన్ బెంచ్ ను ఏర్పాటు చేసింది. జస్టిస్ ప్రవీణ్ ఆధ్వర్యంలో డివిజన్ బెంచ్ ప్రస్తుతం విచారణ మొదలెట్టింది. రఘురామ తరఫున సీనియర్ అడ్వొకేట్ ఆదినారాయణరావు స్పెషల్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ సందర్భంగా రఘురామ తరఫు న్యాయవాదులు తమ క్లయింటు కాలి గాయాలను కోర్టుకు చూపించారు. ఈ నేపథ్యంలో, సీఐడీ అధికారుల తీరుపై న్యాయమూర్తి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

పార్లమెంటు సభ్యుడి శరీరంపై నిన్న లేని గాయాలు ఇప్పుడు కనిపిస్తున్నాయని, కారణమేంటని న్యాయమూర్తి ప్రశ్నించారు. కస్టడీలో ఉన్న వ్యక్తిని కొట్టినట్టు నిరూపితమైతే పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయని సీఐడీ అధికారులను హెచ్చరించారు. ఎంపీ శరీరంపై ఉన్న గాయాల నిర్ధారణకు మెడికల్ టీమ్ ను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

వాదనల సందర్భంగా.... రిమాండ్ రిపోర్టును వెంటనే రద్దు చేసి, రఘురామను విడుదల చేయాలని ఆయన తరఫు న్యాయవాదులు కోర్టుకు విన్నవించారు. రఘురామను నిబంధనలకు విరుద్ధంగా అరెస్ట్ చేశారని ఆరోపించారు.