పంజాబ్ లో కొత్త జిల్లా ఏర్పాటుపై యూపీ సీఎం యోగి ఆగ్రహం

15-05-2021 Sat 16:58
  • మలేర్ కోట్ల జిల్లాను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించిన అమరీందర్ సింగ్
  • మతాల ఆధారంగా విభజన సరికాదని యోగి మండిపాటు
  • ఇవి విభజన రాజకీయాలేనని ఆగ్రహం
Yogi Adityanath Slams Creation Of New Punjab District

పంజాబ్ లో మలేర్ కోట్ల పేరుతో కొత్త జిల్లాను ఏర్పాటు చేయడంపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ మండిపడ్డారు. ఇవి ముమ్మాటికీ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న విభజన రాజకీయాలేనని విమర్శించారు. మతాలు, నమ్మకాల ఆధారంగా జరిగే ఏ విభజన అయినా భారత రాజ్యాంగానికి విరుద్ధమేనని చెప్పారు.

మలేర్ కోట్ల జిల్లాను ఏర్పాటు చేస్తున్నట్టు పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ నిన్న ప్రకటన చేసిన ఒక్క రోజు వ్యవధిలోనే యోగి ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. మలేర్ కోట్ల ప్రాంతం చండీగఢ్ కు 131 కిలోమీటర్ల దూరంలో ఉంది.

నిన్న రంజాన్ సందర్భంగా పంజాబీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ కొత్త జిల్లా ప్రకటన చేశారు. ఈ కొత్త జిల్లాకు ఎంతో చారిత్రక విలువ ఉందని ఆయన చెప్పారు. కొత్త జిల్లా పాలనా వ్యవస్థ కోసం తక్షణమే కార్యాలయాలను ఏర్పాటు చేయాలని ఆయన ఆదేశించారు. ఈ జిల్లా ఏర్పాటు కోసం ఎప్పటి నుంచో డిమాండ్లు ఉన్నాయని... ప్రజల డిమాండ్ల మేరకు తాము ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. కొత్త జిల్లాలో గ్రామాలను చేర్చే ప్రక్రియ త్వరలోనే ప్రారంభమవుతుందని తెలిపారు.

మలేర్ కోట్లను 1454లో ఆఫ్ఘనిస్థాన్ నుంచి వచ్చిన షేక్ సద్రుద్దీన్ ఇ జహాన్ నిర్మించారు. ఆ తర్వాత 1657లో బయాజిద్ ఖాన్ మలేర్ కోట్లలో సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేశారు. తదనంతరం జరిగిన పలు పరిణామాల నేపథ్యంలో ఈ ప్రాంతం పటియాలా మరియు పంజాబ్ స్టేట్స్ యూనియన్ లో చేర్చబడింది. 1956లో జరిగిన రాష్ట్రాల పునర్విభజనలో మలేర్ కోట్ల పంజాబ్ రాష్ట్రంలో ఒక భాగంగా మారింది.

పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ పటియాలా రాజకుటుంబానికి చెందిన వ్యక్తి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మలేర్ కోట్ల నవాబులతో తమ పూర్వీకులకు ఉన్న సంబంధాలను గుర్తు చేసుకున్నారు. అంతేకాదు కొత్త జిల్లాపై వరాలు కూడా ప్రకటించారు. రూ. 500 కోట్లతో నవాబ్ షేర్ మొహమ్మద్ ఖాన్ పేరుతో మెడికల్ కాలేజీని నిర్మిస్తామని ప్రకటించారు.