Tauktae: తీవ్ర తుపానుగా మారనున్న 'తౌతే '... ఏపీకి వర్షసూచన

  • అరేబియా సముద్రంలో కొనసాగుతున్న 'తౌతే'
  • మరో 18 గంటల్లో అతి తీవ్ర తుపానుగా బలపడే అవకాశం
  • ఈ నెల 18న గుజరాత్ వద్ద తీరం దాటనున్న 'తౌతే'
  • నేడు, రేపు ఏపీలో ఓ మోస్తరు వర్షాలు
  • విదర్భ పరిసరాల్లో బలహీనపడిన ఉపరితల ఆవర్తనం
Tauktae likely intensify into severe cyclonic storm

అరేబియా సముద్రంలో ఏర్పడిన 'తౌతే' తుపాను మరో 6 గంటల్లో తీవ్ర తుపానుగా బలపడనుంది. ఆపై మరో 12 గంటల్లో అతి తీవ్ర తుపానుగా రూపాంతరం చెందుతుందని వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం ఇది గోవాకు దక్షిణ నైరుతి దిశగా 330 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. క్రమేపీ ఉత్తర వాయవ్య దిశగా పయనించి మరింత బలం పుంజుకోనుంది.

'తౌతే' తుపాను ఈ నెల 18న గుజరాత్ వద్ద తీరాన్ని తాకనుంది. మధ్యాహ్నం 2.30 గంటల నుంచి రాత్రి 8.30 గంటల మధ్య పోరుబందర్-నలియా ప్రాంతాల నడుమ భూభాగంపైకి ప్రవేశించనుంది.

'తౌతే' ప్రభావం ఏపీపైనా పాక్షికంగా ఉండనుందని వాతావరణ శాఖ నివేదిక చెబుతోంది. రాష్ట్రంలో నేడు, రేపు పలుచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడతాయని అధికారులు పేర్కొన్నారు. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షం కురిసే అవకాశం ఉందని వివరించారు.

కాగా, విదర్భ పరిసరాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం బలహీనపడింది. ఈ ఉపరితల ఆవర్తనం కారణంగా తెలంగాణలో కొన్నిరోజులుగా వర్షాలు పడుతున్న సంగతి తెలిసిందే.

More Telugu News