రఘురాజులాంటి వారి విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుంది: ఏపీ మంత్రి తానేటి వనిత

15-05-2021 Sat 15:49
  • ప్రజాప్రతినిధికి ఉన్న లక్షణాలు రఘురాజులో లేవు
  • సొంత నియోజకవర్గానికి ఆయన చేసిందేమీ లేదు
  • టీడీపీ స్క్రిప్టును ఆయన చదువుతున్నారు
We all welcome the arrest of Raghu Rama Krishna Raju says Taneti Vanita

వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజును ఏపీ సీఐడీ అరెస్ట్ చేసిన తర్వాత రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఆధికార, విపక్ష నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఈ నేపథ్యంలో మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ రఘురాజుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగన్ పెట్టిన భిక్షతోనే ఆయన ఎంపీ అయ్యారని చెప్పారు. ప్రజాప్రతినిధికి సరైన భాష, వ్యవహారశైలి ఉండాలని... అయితే ఈ లక్షణాలు ఆయనలో లేవని విమర్శించారు. ఎంపీగా గెలిచి రెండేళ్లు అవుతున్నా సొంత నియోజకవర్గానికి ఆయన చేసిందేమీ లేదని దుయ్యబట్టారు.

ప్రజా సంక్షేమాన్ని రఘురాజు వదిలేశారని... సొంత పార్టీని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని వనిత అన్నారు. ఆయనకు ఉన్న స్థాయిని కూడా మర్చిపోయి... టీడీపీ ఇచ్చిన స్క్రిప్టును చదువుతూ మాట్లాడుతున్నారని విమర్శించారు. రఘురాజు అరెస్ట్ ను తామంతా సమర్థిస్తున్నామని చెప్పారు. రఘురాజులాంటి వారి విషయంలో చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందని... ఆయన వెనకున్న వాళ్లందరూ ఈ విషయాన్ని గమనించాలని అన్నారు.