Spice Jet: కరోనా నెగెటివ్ సర్టిఫికెట్ లేకుండా క్రొయేషియా వెళ్లిన భారత పైలెట్లు... 40 గంటల పాటు విమానంలోనే!

  • కరోనా నేపథ్యంలో అనేక దేశాల్లో కఠిన ఆంక్షలు
  • నెగెటివ్ సర్టిఫికెట్ ఉంటేనే అనుమతి
  • మంగళవారం ఢిల్లీ నుంచి క్రొయేషియా వెళ్లిన స్పైస్ జెట్ ప్లేన్
  • ఆర్టీపీసీఆర్ టెస్టులు చేయించుకోని పైలెట్లు
  • ఎయిర్ పోర్టులోకి ప్రవేశాన్ని నిషేధించిన అధికారులు
Spice Jet pilots faces unusual situation in Croatia after they had no corona negative certificates

కరోనా మహమ్మారి ప్రభావంతో అనేక దేశాలు తమ దేశంలో అడుగుపెట్టేవారిపై తీవ్రస్థాయిలో ఆంక్షలు విధిస్తున్నాయి. ఈ క్రమంలో నిబంధనలు పాటించకపోతే చేదు అనుభవాలు ఎదుర్కోకతప్పదు. అందుకు ఈ ఘటనే ఉదాహరణ. స్పైస్ జెట్ కు చెందిన బోయింగ్ 737 విమానం గత మంగళవారం ఢిల్లీ నుంచి క్రొయేషియా రాజధాని జాగ్రెబ్ వెళ్లింది. అయితే, ఆ స్పైస్ జెట్ విమానంలోని నలుగురు పైలెట్లను క్రొయేషియా అధికారులు తమ భూభాగంపై కాలుమోపేందుకు అంగీకరించలేదు. అందుకు కారణం వారివద్ద కొవిడ్ నెగెటివ్ సర్టిఫికెట్లు లేకపోవడమే.

స్పైస్ జెట్ యాజమాన్యం ఢిల్లీలోనే ఆర్టీ-పీసీఆర్ టెస్టులు నిర్వహించి ఉంటే వారికా ఇబ్బంది తప్పేది. కానీ, వారికి కరోనా టెస్టులు చేయకపోవడంతో క్రొయేషియాలో ఊహించని అనుభవం ఎదురైంది. ఆ నలుగురు పైలెట్లకు జాగ్రెబ్ విమానాశ్రయంలో ప్రవేశించేందుకు అనుమతి నిరాకరించారు. దాంతో వారు తమ విమానంలోనే 40 గంటల పాటు గడపాల్సి వచ్చింది.

ఆ స్పైస్ జెట్ విమానం తిరిగి భారత్ వచ్చేటప్పుడు కూడా క్రొయేషియా అధికారులు తమ నిబంధనలు వర్తింపజేశారు. ఆ విమానంలో ఎక్కేందుకు ప్రయాణికులెవరినీ అనుమతించలేదు సరికదా, కనీసం సరకు రవాణా కూడా జరపనివ్వలేదు. దాంతో, ఆ నలుగురు పైలెట్లతోనే స్పైస్ జెట్ విమానం ఖాళీగా ఢిల్లీ తిరిగొచ్చింది.

More Telugu News