పగలు ఫుడ్ డెలివరీలు... రాత్రి దారిదోపిడీలు!

15-05-2021 Sat 14:29
  • హైదరాబాదులో ఆరుగురు సభ్యుల ముఠా అరెస్ట్
  • అదుపులోకి తీసుకున్న బాచుపల్లి పోలీసులు
  • స్విగ్గీ, జొమాటోలో పనిచేస్తున్న యువకులు
  • రాత్రివేళల్లో ఒంటరిగా కనిపించినవారిపై దాడులు
  • దోచుకున్న వస్తువులు ఓఎల్ఎక్స్ లో విక్రయం
Hyderabad police arrests robbers gang

దేశంలో కరోనా స్వైరవిహారం నేపథ్యంలో ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థలు స్విగ్గీ, జొమాటో రాత్రి 8 గంటల తర్వాత కార్యకలాపాలు నిలిపివేస్తున్న సంగతి తెలిసిందే. అయితే, పగలు స్విగ్గీ, జొమాటో ఫుడ్ డెలివరీ బాయ్స్ గా పనిచేస్తున్న కొందరు యువకులు, రాత్రివేళ దారిదోపిడీలకు పాల్పడుతుండడం వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో దోపిడీలకు పాల్పడుతున్న ఆరుగురు సభ్యుల ముఠాను బాచుపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

రాత్రివేళ ఒంటరిగా కనిపించే వారిని లక్ష్యంగా చేసుకుని ఈ ముఠా దోపిడీలకు తెగబడుతున్నట్టు గుర్తించారు. దోచుకున్న వస్తువులను ఓఎల్ఎక్స్ లో విక్రయిస్తుంటారు. విలాసాలకు అలవాటు పడిన వీరు, పగలు స్విగ్గీ, జొమాటోలో పనిచేస్తూ, రాత్రివేళల్లో దొంగతనాలు చేస్తున్నట్టు గుర్తించారు.