TS Govt: ఎట్టకేలకు సరిహద్దుల్లో అంబులెన్సులను అనుమతిస్తున్న తెలంగాణ ప్రభుత్వం!

  • కరోనా బాధితుల తాకిడితో ఆసుపత్రులపై ఒత్తిడి
  • పడకల కొరత కారణంగా ఇతర రాష్ట్రాల అంబులెన్సులపై ఆంక్షలు
  • తీవ్ర వివాదానికి దారితీసిన అంశం
  • తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు మండిపాటు
  • ప్రభుత్వ ఆంక్షలపై స్టే
  • దిద్దుబాటు చర్యలు చేపట్టిన తెలంగాణ ప్రభుత్వం
TS Govt is Allowing ambulances at borders

ఏపీ నుంచి వస్తున్న అంబులెన్సులను తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర సరిహద్దుల్లో నిలిపివేస్తుండడంపై ఇక్కడి హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం అంబులెన్సులను అనుమతించాలని నిర్ణయించింది.

ఈ మేరకు సూర్యాపేట జిల్లా రామాపురం చెక్‌పోస్ట్‌ వద్ద ఇప్పటి వరకు అమలు చేసిన ఆంక్షల్ని ఎత్తివేశారు. దీంతో ఏపీ నుంచి వస్తున్న అంబులెన్సులు తెలంగాణలోకి ప్రవేశిస్తున్నాయి. దీంతో రోగుల బంధువులు కాస్త కుదుటపడ్డారు. ఎలాంటి పాసులు, అనుమతి పత్రాలు లేకపోయినప్పటికీ.. పోలీసులు అంబులెన్సులను అనుమతిస్తుండడం గమనార్హం.

అంతకుముందు అంబులెన్సులను నిలిపివేయాలన్న తెలంగాణ ప్రభుత్వ ఆదేశాలను సవాల్‌ చేస్తూ విశ్రాంత ఐఆర్‌ఎస్‌ వెంకట కృష్ణారావు కోర్టులో హౌస్‌మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ హిమా కోహ్లీ నేతృత్వంలోని ధర్మాసనం తెలంగాణ ప్రభుత్వ తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. అంబులెన్సులను ఆపే హక్కు ప్రభుత్వానికి లేదని తేల్చి చెప్పింది. ప్రభుత్వ ఉత్తర్వులపై స్టే విధించింది. ఈ నేపథ్యంలో తాజాగా తెలంగాణ ప్రభుత్వం అంబులెన్సులను అనుమతిస్తూ నిర్ణయం తీసుకుంది.

More Telugu News