భారత్ లో సింగిల్ డోస్ కరోనా టీకాలు... రేసులో జాన్సెన్, స్పుత్నిక్ లైట్

14-05-2021 Fri 21:40
  • భారత్ లో ప్రస్తుతం రెండు డోసుల వ్యాక్సిన్ల పంపిణీ
  • సమస్యాత్మకంగా మారిన డోసుల మధ్య విరామం, కొరత
  • ఆశలు రేకెత్తిస్తున్న సింగిల్ డోసు వ్యాక్సిన్లు
  • మే నెలాఖరుకు స్పుత్నిక్ లైట్ ప్రయోగ ఫలితాలు
  • భాగస్వామి కోసం చూస్తున్న జాన్సన్ అండ్ జాన్సన్
Single dose corona vaccines likely roll out in India

ప్రస్తుతం అమల్లో ఉన్న రెండు డోసుల కరోనా వ్యాక్సిన్ల పంపిణీ ఓ సమస్యగా మారింది. రెండు డోసుల మధ్య విరామం, వ్యాక్సిన్ల కొరత అధికార యంత్రాంగాన్ని వేధిస్తున్నాయి. ఈ పరిస్థితులను అధిగమించేందుకు సింగిల్ డోస్ వ్యాక్సిన్లు రంగప్రవేశం చేయనున్నాయి. అన్నీ కుదిరితే.... అమెరికాకు చెందిన 'జాన్సెన్' (జాన్సన్ అండ్ జాన్సన్), రష్యాకు చెందిన 'స్పుత్నిక్ లైట్' కరోనా వ్యాక్సిన్లు భారత్ లో అందుబాటులోకి రానున్నాయి. ఈ రెండు సింగిల్ డోస్ వ్యాక్సిన్లే.

'స్పుత్నిక్ లైట్' చివరి దశ ప్రయోగ ఫలితాలు త్వరలోనే వెల్లడి కానుండగా, జులైలో ఇది భారత్ లో అందుబాటులోకి వస్తుందని భావిస్తున్నారు. రష్యాకు చెందిన 'స్పుత్నిక్ వి' వ్యాక్సిన్ ను భారత్ లో పంపిణి చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్న డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్... 'స్పుత్నిక్ లైట్' సింగిల్ డోస్ వ్యాక్సిన్ కోసం కేంద్రంతో సంప్రదింపులు జరుపుతోంది.

అటు, జాన్సన్ అండ్ జాన్సన్ తన 'జాన్సెన్' సింగిల్ డోస్ వ్యాక్సిన్ కోసం భారత్ లో తగిన భాగస్వామి కోసం అన్వేషిస్తోంది. భారత్ లోనే ఉత్పత్తి, పంపిణీ చేసేందుకు తగిన వనరులున్న భాగస్వామి కోసం ఈ అమెరికా సంస్థ ప్రయత్నిస్తోంది.