Delhi: కరోనా ఔషధ పంపిణీపై గంభీర్‌ను వివరణ కోరిన ఢిల్లీ పోలీసులు

  • కొవిడ్‌ సహాయ కార్యక్రమాలు చేస్తున్న విపక్ష సభ్యులు
  • కొరత నేపథ్యంలో వారిని విచారిస్తున్న ఢిల్లీ పోలీసులు
  • యువజన కాంగ్రెస్‌ అధ్యక్షుడినీ విచారించిన పోలీసులు
  • విపక్షాల విమర్శలతో అప్రమత్తమైన పోలీసు యంత్రాంగం
  • గంభీర్‌నూ వివరణ కోరిన వైనం
Delhi Police Seek details from gautham gambhir about Fabiflu distribution

కరోనా చికిత్సలో కీలకంగా భావిస్తున్న ఔషధాల్లో ఫ్యాబిఫ్లూ ఒకటి. ఇటీవల భాజపా ఎంపీ గౌతమ్‌ గంభీర్ తన నియోజకవర్గం తూర్పు ఢిల్లీలో ప్రజలకు ఈ మందును పంపిణీ చేశారు. ట్విట్టర్‌ వేదికగా కావాల్సిన వారు ఈ ఔషధాన్ని తన కార్యాలయం నుంచి తీసుకోవాలని ప్రజలకు తెలియజేశారు. అయితే, అదే ఇప్పుడు ఆయనను ఇరకాటంలో పడేసింది.

మరోవైపు కొవిడ్‌ సహాయ కార్యక్రమాలు చేస్తున్న ప్రతిపక్ష పార్టీల నాయకులు సహా ఇతర సంఘాల ప్రతినిధులను ఢిల్లీ క్రైం బ్రాంచ్‌ పోలీసులు విచారిస్తున్నారు. దేశవ్యాప్తంగా కీలక ఔషధాల కొరత ఉన్న తరుణంలో వీటిని ఎక్కడి నుంచి సమకూర్చుకుంటున్నారని ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలో యువజన కాంగ్రెస్‌ చీఫ్  బి.వి.శ్రీనివాస్‌ను సైతం పోలీసులు నేడు విచారించారు. ఈ చర్యలపై విపక్షాలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి.

అందులో భాగంగానే బీజేపీకి చెందిన గంభీర్‌ను కూడా ఔషధాలు ఎక్కడి నుంచి వచ్చాయని పోలీసులు వివరణ కోరారు. దీనిపై గంభీర్‌ మాట్లాడుతూ.. ఫ్యాబిఫ్లూ పంపిణీకి సంబంధించిన అన్ని వివరాలను పోలీసులకు ఇచ్చామని తెలిపారు. ఢిల్లీ ప్రజలకు తన సామర్థ్యం మేర సాయం చేస్తూనే ఉంటానని వ్యాఖ్యానించారు.

More Telugu News