Goa: 4 రోజుల్లో 74 మంది మృతి.. గోవా ఆసుపత్రిలో ఆక్సిజన్ అందక కొడిగడుతున్న ప్రాణాలు

74 Deaths At Goas Biggest Covid Hospital Battling Oxygen Shortage
  • శుక్రవారం తెల్లవారుజామున 13 మంది బలి
  • ఘటనలపై విచారణకు ముగ్గురు సభ్యుల కమిటీ
  • ఆక్సిజన్ కోటా పెంచాలంటూ కేంద్రానికి లేఖ
  • 11 టన్నుల నుంచి 22 టన్నులకు పెంచాలని విజ్ఞప్తి
మొన్నటిదాకా ఆక్సిజన్ లేక ఢిల్లీ అల్లాడిపోతే.. ఇప్పుడు గోవా కూడా అదే పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఒకటి కాదు.. రెండు కాదు.. 4 రోజుల్లోనే 74 మంది కరోనా బాధితులు ఆక్సిజన్ అందక మరణించారు. అదీ ఒక్క ఆసుపత్రిలోనే. గోవాలోనే పెద్దాసుపత్రి అయిన గోవా మెడికల్ కాలేజ్ ఆసుపత్రిలో ఈ దారుణాలు జరిగాయి.

శుక్రవారం తెల్లవారుజామున 13 మంది చనిపోయినట్టు అధికారులు చెబుతున్నారు. అంతకుముందు గురువారం 15 మంది చనిపోగా, బుధవారం 20 మంది, మంగళవారం 26 మంది ఆక్సిజన్ లేక మృతి చెందారు. ఈ ఘటనలపై విచారణ జరిపేందుకు ముగ్గురు సభ్యులతో రాష్ట్ర ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది.

దీంతో ఇప్పుడు ఆక్సిజన్ కోసం ఢిల్లీ, బెంగాల్, కేరళ, కర్ణాటకలాగానే గోవా కూడా కేంద్రాన్ని సంప్రదించింది. పది రోజుల్లో రాష్ట్రానికి కేవలం 40 టన్నుల ఆక్సిజన్ వచ్చింది. కోల్హాపూర్ ప్లాంట్ నుంచి గోవాకు కేటాయించిన 110 టన్నుల్లో మే 1 నుంచి 10 మధ్య 66.74 టన్నులను సరఫరా చేశారు. ఈ నేపథ్యంలోనే రోజువారీ కేటాయింపులను 11 టన్నుల నుంచి 22 టన్నులకు పెంచాల్సిందిగా కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది.

ఇక, రవాణా సాకు చెప్పి కరోనా పేషెంట్ల మృతికి కారణం కాకూడదని బాంబే హైకోర్టులోని గోవా ధర్మాసనం తేల్చి చెప్పింది. కాగా, నిన్న ఒక్కరోజే 2,491 మంది కరోనా బారిన పడ్డారని, 62 మంది చనిపోయారని గోవా ప్రభుత్వం వెల్లడించింది.
Goa
Oxygen
Pramod Savanth
COVID19

More Telugu News