Inmate: యూపీలో అమానవీయ ఘటన.. 92 ఏళ్ల వృద్ధ ఖైదీని గొలుసుతో బంధించి చికిత్స

  • హత్య కేసులో శిక్ష అనుభవిస్తున్న 92 ఏళ్ల వృద్ధుడు
  • సోషల్ మీడియాలో ఫొటోలు వైరల్
  • జైలు వార్డెన్ సస్పెన్షన్  
Elderly Inmate Chained Up During Treatment In UP

ఉత్తరప్రదేశ్‌లో అత్యంత అమానవీయ ఘటన జరిగింది. ఓ హత్యకేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న 92 ఏళ్ల వృద్ధుడు అనారోగ్యం బారినపడితే అతడిని గొలుసులతో మంచానికి బంధించి చికిత్స అందించారు. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో జైలు అధికారులు స్పందించి చర్యలు ప్రారంభించారు.

ఓ హత్య కేసులో దోషిగా తేలిన వృద్ధుడు ఈటా జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. అతడి వయసు ఇప్పుడు 92 సంవత్సరాలు. ఇటీవల అతడు శ్వాస సంబంధ సమస్యలతో బాధపడడంతో జైలు ఆసుపత్రిలో ఉంచి చికిత్స అందిస్తున్నారు.

అయితే, బాధిత ఖైదీకి మరింత మెరుగైన వైద్యం కోసం అక్కడి వైద్యులు అలీగఢ్ ఆసుపత్రికి సిఫారసు చేశారు. అక్కడకు తరలించినా బెడ్లు అందుబాటులో లేకపోవడంతో తిరిగి జైలు ఆసుపత్రికే తీసుకొచ్చారు. అక్కడి సిబ్బంది కదిలే పరిస్థితిలో కూడా లేని ఆ వృద్ధుడి కాళ్లను గొలుసులతో మంచానికి కట్టేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో జైలు అధికారుల తీరుపై తీవ్ర విమర్శలు వచ్చాయి. స్పందించిన ఉన్నతాధికారులు ఈటా జైలు వార్డెన్ అశోక్ యాదవ్‌ను సస్పెండ్ చేశారు.

More Telugu News