నేను చేసిన కొన్ని తప్పులు బయటకొచ్చాయి: అభిరామ్‌ దగ్గుబాటి

14-05-2021 Fri 09:17
  • తప్పులు అందరూ చేస్తుంటారు
  • చేసిన తప్పుల నుంచి ఎన్నో నేర్చుకున్నా
  • తేజ దర్శకత్వంలో హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నా
Learnt many things from my mistakes says Daggubati Abhiram

తప్పులు అందరూ చేస్తుంటారని... తాను చేసిన కొన్ని తప్పులు బయటకొచ్చాయని సినీ నిర్మాత దగ్గుబాటి సురేశ్ బాబు కుమారుడు అభిరామ్ తెలిపాడు. చేసిన తప్పుల నుంచి తాను ఎన్నో నేర్చుకున్నానని చెప్పాడు. ఎలాంటి పనులు చేయాలి? ఏమి చేయకూడదు? అనే విషయాలు తెలిసొచ్చాయని అన్నాడు. కష్ట సమయంలో తన కుటుంబం తనకు అండగా నిలబడిందని చెప్పాడు. తన సినీ కెరీర్ ప్రారంభం కావడానికి ముందే ఇలా జరిగిపోయిందని... అందువల్ల ఇంకెప్పుడూ అలాంటి తప్పులు చేయకూడదని తెలుసుకున్నానని అన్నాడు.

దర్శకుడు తేజ తెరకెక్కించబోయే చిత్రం ద్వారా హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నానని అభిరామ్ తెలిపాడు. తేజ సార్ సినిమాలో నటించబోతుండటం సంతోషంగా ఉందని... అయితే ఇదే సమయంలో కాస్త భయం కూడా కలుగుతోందని చెప్పాడు. 'నేనే రాజు నేనే మంత్రి' సినిమా షూటింగ్ సమయంలో ఆయన వర్క్ ఎలా ఉంటుందో ప్రత్యక్షంగా చూశానని తెలిపాడు. తనను హీరోగా మీరే పరిచయం చేయాలి సార్ అంటూ ఈ సినిమా షూట్ లో ఆయనతో అంటుండేవాడినని... తప్పకుండా నీ కోసం ఒక కథ రాస్తానని ఆయన చెబుతుండేవారని అన్నాడు.

ఇచ్చిన మాట ప్రకారమే ఒక కథ రాసి, నాన్నకు చూపించారని... నాన్నకు ఆ కథ నచ్చడంతో సినిమాల్లోకి హీరోగా ఎంట్రీ ఇస్తున్నానని తెలిపాడు. కరోనా తీవ్రత తగ్గిన తర్వాత షూటింగ్ ప్రారంభమవుతుందని చెప్పాడు. మరోవైపు సినీనటి శ్రీరెడ్డి విషయంలో అభిరామ్ పేరు బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. వీరిద్దరూ చాలా క్లోజ్ గా ఉన్న ఫొటోలు అప్పట్లో కలకలం రేపాయి.