TTD: హనుమంతుడి జన్మస్థలంపై చర్చకు ఇప్పుడే రెడీ.. టీటీడీకి కిష్కింద ట్రస్టు మరో లేఖ

  • అంజనాద్రిని హనుమంతుడి జన్మస్థలంగా పేర్కొన్న టీటీడీ
  • కానే కాదంటూ లేఖ రాసిన కిష్కింధ హనుమద్ జన్మభూమి తీర్థ ట్రస్ట్
  • చర్చకు తేదీని ప్రకటించాలంటూ టీటీడీకి సవాల్
War of words between ttd and kishkinda trust

హనుమంతుడి జన్మస్థలంపై టీటీడీ, కిష్కింద ట్రస్టు మధ్య వివాదం కొనసాగుతోంది. తిరుమలలోని అంజనాద్రే హనుమంతుడి జన్మస్థలమంటూ గత నెలలో తిరుమల తిరుపతి దేవస్థానం చేసిన ప్రకటనను కర్ణాటకలోని కిష్కింద హనుమద్ జన్మభూమి తీర్థ ట్రస్ట్ వ్యతిరేకించింది. ఆంజనేయుడి జన్మస్థలం అంజనాద్రి కానేకాదని, టీటీడీ అసత్యాలను ప్రచారం చేస్తోందని ట్రస్టు వ్యవస్థాపక ధర్మకర్త గోవిందానంద సరస్వతి ఆ లేఖలో పేర్కొన్నారు.

ట్రస్టు లేఖకు టీటీడీ ఘాటుగా బదులిస్తూ లేఖ రాసింది. నాలుగు నెలల పరిశోధన తర్వాతే అంజనాద్రిని హనుమంతుడి జన్మస్థలంగా గుర్తించామని, ఈ విషయంలో అవసరమైతే చర్చకు రావాలని సవాలు విసిరింది. టీటీడీ లేఖపై తాజాగా గోవిందానంద సరస్వతి లేఖ రాశారు. చర్చ కోసం పది, 20 రోజులు ఎందుకు ఆగాలని, ఇప్పటికిప్పుడైనా తాము చర్చకు సిద్ధంగానే ఉన్నామని ప్రతి సవాల్ విసిరారు.

నిజానికి మీరు నాలుగు నెలలపాటు చేసిన పరిశోధనపై మీకే నమ్మకం లేనట్టుందని ఎద్దేవా చేశారు. లేఖలతో సమయం వృథా చేయకుండా మీ విలువలపై నమ్మకం ఉంటే చర్చ సభ తేదీని ప్రకటించాలని కోరారు. సమయం మీరు చెప్పినా సరే, లేకుంటే తమను చెప్పమన్నా ఓకే అని నిర్ణయాన్ని టీటీడీకే వదిలేశారు. నిర్ణయం తీసుకున్న అనంతరం తేదీని ప్రకటిస్తే సరిపోతుందని గోవిందానంద ఆ లేఖలో పేర్కొన్నారు.

More Telugu News