సొంత ప్రధానిపైనే సెటైర్లు వేస్తున్న పాక్ ప్రజలు... మిలిందా గేట్స్ ను పెళ్లాడాలంటూ ఇమ్రాన్ కు విజ్ఞప్తులు!

13-05-2021 Thu 21:10
  • విడాకులకు సిద్ధమైన బిల్ గేట్స్, మిలిందా 
  • పెద్దమొత్తంలో ఆస్తి దక్కించుకోనున్న మిలిందా 
  • పాక్ బడ్జెట్ కంటే ఎక్కువే ఉంటుందన్న నెటిజన్లు
  • ఇమ్రాన్ ఆమెను పెళ్లాడితే పాక్ ఆర్థిక స్థితి మెరుగవుతుందని వ్యాఖ్యలు
Poeple suggests Imran another marriage

మైక్రోసాఫ్ట్ దిగ్గజం బిల్ గేట్స్, ఆయన భార్య మిలిందా గేట్స్ విడాకులకు సిద్ధమైన సంగతి తెలిసిందే. బిల్ గేట్స్ ఆస్తి విలువ 130.5 బిలియన్ డాలర్ల వరకు ఉంటుందని ఓ అంచనా. విడాకులు తీసుకుంటే ఆస్తిలో చెరి సంగం పంచుకోవాల్సి ఉంటుంది. ఆ లెక్కన మిలిందా గేట్స్ కూడా ప్రపంచ సంపన్నురాలు అవుతుంది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ ప్రజలు ఏకంగా తమ ప్రధానిపైనే వ్యంగ్యం గుప్పిస్తున్నారు.

విడాకులు తీసుకుంటున్న మిలిందా గేట్స్ ను ఇమ్రాన్ ఖాన్ పెళ్లాడాలని, దాంతో పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థ బాగుపడుతుందని అంటున్నారు. పాకిస్థాన్ వార్షిక బడ్జెట్ కంటే మిలిందా ఆస్తి విలువే ఎక్కువని చెబుతున్నారు. ఇమ్రాన్ ఖాన్ కు పెళ్లిళ్లేమీ కొత్త కాదని, మిలిందాను చేసుకోవచ్చని విజ్ఞప్తులు చేస్తున్నారు. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ గతంలో క్రికెటర్ అన్న సంగతి తెలిసిందే. పాకిస్థాన్ జట్టుకు వరల్డ్ కప్ అందించిన కెప్టెన్ గానే కాకుండా, నికార్సయిన ఆల్ రౌండర్ గా ఇమ్రాన్ ఖాన్ క్రికెట్ చరిత్రలో నిలిచిపోతారు.

అయితే, క్రికెటర్ గా ఉన్నప్పుడు ఆయనకు అనేకమందితో అఫైర్లు ఉండేవని ఇప్పటికీ ప్రచారంలో ఉంది. అందుకు తగ్గట్టే ఆయన మూడు పెళ్లిళ్లు చేసుకున్నారు. తాజాగా మిలిందా గేట్స్ ను ఇమ్రాన్ తో ముడివేస్తూ, దేశం కోసం మరో పెళ్లి చేసుకోవచ్చు కదా? అని సోషల్ మీడియాలో సరదాగా వ్యాఖ్యానిస్తున్నారు.